సూర్యాపేట: హుజూర్నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ గెలిచితీరుతుందని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ హుజూర్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సైదిరెడ్డి. తమ దృష్టి
హుజూర్నగర్ అభివృద్ధిపైనే అని స్పష్టం చేశారు. ఈ రోజుతో ఎన్నికల ప్రచారానికి చివరిరోజు కావడంతో ఆయన మీడియాతో మాట్లాడుతూ...టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ పండుగలకు, పెళ్లిళ్లకు తప్ప ఏనాడూ హుజూర్నగర్కు రాలేదన్నారు. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్ ఏనాడు నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. తాను జన్మించిన జన్మభూమికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ పనిచేస్తున్నానన్నారు. గతంలో తాను ఓడిపోయినా ప్రజలతో కలిసి పనిచేస్తున్న విషయాన్ని గమనించాలని కోరారు. ఈ ఎన్నిక హుజూర్నగర్ అభివృద్ధికి అదృష్టం కొద్ది వచ్చిన ఎన్నికని, అందరు కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని సైదిరెడ్డి విజ్ఞప్తి చేశారు.