సూర్యాపేట: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రాచరిక పాలన చేస్తున్నారని మండిపడ్డారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ నాయకుడు పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో శనివారం
ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ... హుజూర్‌నగర్ ఉప ఎన్నిక భవిష్యత్ తెలంగాణ స్వరూపాన్ని నిర్ణయిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ నిర్బంధాలతో రాష్ట్రాన్ని పాలించాలని చూస్తున్నారని, సమ్మె విషయంలో మంత్రివర్గంలో చీలిక వచ్చిందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదు సరే.. ఆర్టీసీని సగం ప్రైవేట్ పరం చేస్తామని కూడా మేనిఫెస్టోలో పెట్టలేదు కదా.. మరి మంత్రులు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఎర్రబస్సుకు 27శాతం ఇంధన ట్యాక్స్ వసూలు చేస్తోన్న కేసీఆర్... ఎయిర్ బస్‌కు మాత్రం 1శాతం ట్యాక్స్‌ను మాత్రమే ఎందుకు వసూలు చేస్తున్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని రూ.85 వేల కోట్ల ఆర్టీసీ ఆస్తులను తన తాబేదార్లకు కట్టబెట్టడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు.