ఉత్తరప్రదేశ్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హిదూ నేత కమలేశ్ తివారీ హత్య కేసులో పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. ఈ హత్య కేసుకు సంబంధించి
యూపీ పోలీసులు తాజాగా ఓ సీసీటీవీ ఫూటేజ్‌ను విడుదల చేశారు. కమలేశ్ తివారీ హత్యకు ముందు ఆయన ఇంటి వద్ద ఉన్న సీసీటీవీలో ముగ్గురు అనుమానితులు తిరుగుతూ కనిపించారు. బిజ్నోర్ జిల్లాకు చెందిన ముగ్గురు ముస్లిం వ్యక్తులు కమలేశ్ తివారీని హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా దీపావళి స్వీటు బాక్సులతో కమలేశ్ ఇంటికి నిందితులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అయితే... ఆ స్వీటు బాక్సుల్లో ఆయుధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కమలేశ్ వద్ద ఉండే ఇద్దరు వ్యక్తిగత సెక్యూర్టీ గార్డులు, హత్య జరిగిన రోజు ఆయన వద్ద లేరు. దీంతో పోలీసులు వారిని విచారించనున్నారు. సెక్యూర్టీ గార్డులను విచారిస్తే నిజాలు బయటకొచ్చే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా... హత్యా ఘటనపై స్పందించిన సీఎం యోగి ఆదిత్యనాథ్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. తన భర్తను చంపిన వారిని శిక్షించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని కమలేశ్ భార్య కిరణ్ తివారీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని హెచ్చరించారు.