సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపు తప్పి సాగర్ కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తోన్న ఆరుగురు ప్రయాణికులు
గల్లంతయ్యారు. ఈ ఘటన జిల్లాలోని కోదాడ నియోజకవర్గం నడిగూడెం మండలంలోని చాకిరాల వద్ద జరిగింది. కోదాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా కారు అదుపు తప్పి సాగర్ ఎడమ కాలువలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అయితే... కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. కాగా... గల్లంతైన వారు హైదరాబాద్ ఏఎస్రావు నగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న అబ్దుల్ అజీద్, రాజేష్, జాన్సన్, సంతోష్ కుమార్, నగేష్, పవన్ కుమార్ లుగా గుర్తించారు. సహోద్యోగి విమలకొండ మహేశ్ వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.