కరీంనగర్: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఈ రోజు బీజేపీ చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘర్షణలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య
తీవ్ర తోపులాట జరిగింది. పోలీసులు భారీగా మోహరించడంతో, బీజేపీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో బీజేపీ కార్యకర్తలు సంజయ్ ను తీసుకెళుతున్న కారుకు అడ్డంగా పడుకున్నారు. కిలోమీటర్ మేర పరుగులు తీసి మరీ పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు... బీజేపీ కార్యకర్తల తోపులాటలో ఏసీపీ అశోక్ కుమార్ కిందపడిపోయారు. అది గమనించిన కానిస్టేబుల్స్ వెంటనే ఏసీపీని పైకి లేపారు. ఎంపీ బండి సజయ్ కలుగజేసుకుని కార్యకర్తలకు సర్దిచెప్పడంతో కాసేపటి తర్వాత పరిస్థితి సద్దుమణిగింది.