నల్గొండ: ఆర్టీసీ ఆస్తులపై సీఎం కేసీఆర్ కన్ను పడిందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అందులో భాగంగానే వరంగల్లో
ఆర్టీసీ ఆస్తులను ఓ ఎంపీకి ధారాదత్తం చేశారని ఆరోపించారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని, ఆయన ఏది మాట్లాడినా మోసమేనని మండిపడ్డారు. ఏపీ సీఎం జగన్ను చూసి కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. ఆర్టీసీపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయనడం సరికాదన్నారు. కాగా... ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు చేసిన వ్యాఖ్యలను ఎంపీ ఖండించారు. సమ్మెపై టీఎన్జీవో నేతల వ్యాఖ్యలు సరికాదన్నారు. ఆర్టీసీ కార్మికులు అధైర్యపడొద్దని, తెలంగాణ సమాజం కార్మికుల వెంట ఉందని ఎంపీ వెంకట్ రెడ్డి ధైర్యం చెప్పారు.