హైదరాబాద్: ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్. ఒక పక్క ఆర్టీసీ
కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే సీఎం వారి జీవితాలతో ఆటలాడుతున్నారని నిప్పులు చెరిగారు. మరోవైపు సెలవులను పొడిగిస్తూ... విద్యార్దుల జీవితాలను కూడా నాశనం చేస్తున్నారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్‌ల కోసం వారు చేస్తున్న సమ్మెను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని వాపోయారు. విద్యార్ధులు, అధ్యాపకులు కూడా సమ్మెలో భాగస్వాములవుతారనే భయంతోనే దసరా సెలవులు పొడిగించారని ఆరోపించారు. ఆనాడు ఉమ్మడి రాష్ట్ర సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి అవలంభించిన విధానాలనే ఇప్పుడు కేసీఆర్ అమలుచేస్తున్నారని దుయ్యబట్టారు. ఆర్టీసీ కార్మికులకు పండగ ముందు జీతం ఇవ్వలేదు. కష్టం చేసిన దానికి జీతం ఇవ్వకపోతే ఎలా?అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఆర్టీసీ బలోపేతానికి ఒక్క చర్య అయినా చేపట్టారా? ఆరేళ్లలో ఒక్క ఆర్టీసీ ఉద్యోగాన్నిఅయినా భర్తీచేశారా? అంటూ లక్ష్మణ్ వరుస ప్రశ్నలు సంధించారు.