నల్గొండ: సీఎం కేసీఆర్ మెడలు వంచే అవకాశం హుజూర్‌నగర్ ప్రజలకు వచ్చిందన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. ఈ నెల 21న హుజూర్‌నగర్ ఉపఎన్నిక ఉన్న నేపథ్యంలో ఆయన
నియోజకవర్గంలో ఈ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఉందనే, ఓట్ల కోసమే ప్రభుత్వం రైతుబంధు డబ్బులు విడుదల చేసిందని ఆరోపించారు. కేసీఆర్ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని, వారి కష్టాలను పంచుకోవడంలేదని ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోందని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయాలని, టీఆర్ఎస్ ని ఓడించాలని సంజయ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.