హైదరాబాద్: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని లేదా... ప్రైవేటీకరిస్తామని
ఎప్పుడూ అనలేదన్నారు. కార్మికులతో సంప్రదింపుల ప్రక్రియ ముగియక ముందే సమ్మెకు వెళ్లారన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకే పండగ సమయంలో సమ్మె మొదలుపెట్టారని అజయ్ విమర్శించారు. ఇది చట్ట విరుద్దమైన సమ్మె అన్నారు. ఇక ప్రతిపక్షాలు కార్మికులు టెంట్ వేసిన చోటల్లా వెళ్లి వాలిపోతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రజలు ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టినా వారి తీరు మారడం లేదన్నారు. టీడీపీ, కాంగ్రెస్ హయాంలో ఆర్టీసీకి నష్టాలే వచ్చాయన్నారు. 2014 బ్యాలెన్స్ షీట్‌లో ఆర్టీసీ ఆస్తుల విలువ రూ.4,416 కోట్లు మాత్రమే అని.. కేసీఆర్ రవాణా మంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే ఆర్టీసీకి రూ.14 కోట్ల లాభం వచ్చిందన్నారు. కాగా.. గత ఐదేళ్లలో ఆర్టీసీకి ప్రభుత్వం రూ.3,303 కోట్లు ఇచ్చిందని అజయ్ స్పష్టం చేశారు.