హైదరాబాద్: అన్ని గ్రామాల్లో 30 రోజుల కార్యాచరణతో మంచి ఫలితం వచ్చిందని 'పల్లె ప్రగతి' విజయవంతమైందన్నారు సీఎం కేసీఆర్. ఈ రోజు ప్రగతి భవన్ లో మంత్రులు, కలెక్టర్లతో సీఎం కేసీఆర్
సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... పల్లె ప్రగతి కార్యక్రమంతో మన ఊరిని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలనే అవగాహన ప్రజల్లో వచ్చిందన్నారు. ప్రతీ నెల అన్ని గ్రామపంచాయతీలకు కలిపి రూ.339 కోట్ల ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందని సీఎం స్పష్టం చేశారు. గ్రామపంచాయతీలకు సమకూరే సొంత ఆదాయానికి ఇది అదనమని సీఎం పేర్కొన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన డీపీవోలు, డీఎల్ పీవోలు, గ్రామ కార్యదర్శులు, సర్పంచులకు సీఎం కేసీఆర్ అభినందనలు తెలియజేశారు.
అలాగే... రాష్ట్రంలో ప్లాస్టిక్ ఉత్పత్తి, అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. త్వరలోనే దీనిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఉత్తర్వులు జారీచేస్తమన్నారు. ఇందుకు అవసరమైన విధివిధానాలను తయారుచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు.