తెలంగాణ సీఎం కేసీఆర్ ఇక బస్సు బాట పట్టనున్నరు. ఎక్కడికైనా సరే బస్సే అంటున్నారు.
ఇదేంటీ అనుకుంటున్నారా? ఏడాది పాలనలో తెలంగాణసీఎం కేసీఆర్ ఎక్కడికి వెళ్లాలన్నా హెలికాప్టర్ నే వినియోగిస్తూ వచ్చారు.. హెలికాప్టర్ లో ఆయన తిరగని జిల్లాలు లేవు... తిరగని ఊరూ లేదు. తుదకు హైదరాబాద్ లో సైతం కూడా.. గాలి మోటర్ లోనే ప్రయాణించి రికార్డు సృష్టించారు కేసీఆర్. కారణాలేమైనా... ఇకపై హెలికాప్టర్ లో కాకుండా బస్సులోనే జిల్లాలు తిరుగుతానని ప్రకటించారు కేసిఆర్ ఏడాది పాలనలో ఆదినుంచీ..తెలంగాణ రాష్ట్ర సీఎం కెసిఆర్ రోడ్డు మార్గంలో వెళ్లడం కంటే గగనమార్గంలో వెళ్లేందుకే ఇస్టపడేవారు. ఆయన అన్ని జిల్లాలను హెలికాప్టర్ లోనే చుట్టొచ్చారు. యాదగిరిగుట్టకు అనేకసార్లు హెలికాప్టర్ లో వెళ్లారు. మొన్న జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ కోటా ఎన్నికల వరకూ కేసీఆర్ ప్రతీ పర్యటన గగనమార్గంలోనే సాగింది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అధికార టిఆర్ఎస్... నల్లగొండ, ఖమ్మం, వరంగల్ స్థానాన్ని కైవసం చేసుకోగా... హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ ఎమ్మెల్సీ సీటును కోల్పోయింది. ఆ ఫలితాలు వచ్చే వరకు సిఎం కెసిఆర్ ప్రతీ పర్యటన గగన మార్గంలోనే సాగింది. ఆ ఫలితాలు వచ్చిన తర్వాత హెలికాప్టర్ ప్రయాణాన్ని మెల్లమెల్లగా తగ్గించారు కెసిఆర్. ఇటీవల హరితహారం పథకంపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఫారెస్టు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్న సమావేశంలో తన పర్యటనలపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇకపై జిల్లాలకు హెలికాప్టర్లలో కాకుండా బస్సుల్లోనే వెళ్లనున్నట్టు ప్రకటించారు.. ఇనాళ్లు హెలికాప్టర్ లో ప్రయాణించిన సీఎం కెసిఆర్... ఉన్నట్లుండి బస్సులో జిల్లా పర్యటనలు చేస్తానని చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సిఎం వెళ్లడమే కాదు.. తెలంగాణ రాష్ట్ర మంత్రులు సైతం అత్యవసర సమయాల్లో హెలికాప్టర్ ను వినియోగించి రాష్ట్రంలో సరికొత్త రికార్డు సృష్టించారు. ఉమ్మడి రాష్ట్రంలో సైతం అత్యవసర సమాయాల్లో ముఖ్యమంత్రులు మాత్రమే హెలికాప్టర్ లు వినియోగించిన సందర్భం ఉంది. కానీ... తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు ఆ జిల్లాకు చెందిన మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డి హెలికాప్టర్ లో ప్రయాణించారు. అదే కాకుండా భద్రాచలం వంతెన పైనుంచి బస్సు బోల్తా పడిన సంఘటన జరిగిన వెంటనే... మంత్రి మహేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు హెలికాప్టర్ లో వెళ్లి అక్కడి పరిస్థితులను పర్యవేక్షించారు. మరోవైపు వర్షాకాలం మొదలు కావడంతో... హెలికాప్టర్ ప్రయాణం అంతగా అనుకూలించే పరిస్థితి లేకపోవడం కూడా కెసిఆర్ రోడ్డు మార్గాన్ని ఎంచుకోవడానికి మరో కారణంగా చెబుతున్నారు. ఏవియేషన్ అధికారులు సైతం వర్షాకాలంలో హెలికాప్టర్ వాడకం అంత అనుకూలం కాదని సిఎంకు నివేదించినట్లు తెలిసింది. ఇటీవల డిండి ఎత్తిపోతల ప్రారంభోత్సవానికి హెలికాప్టర్ లో వెళ్లాలనుకున్నా, ప్రతికూల వాతావరణం కారణంగా ఏవియేషన్ అధికారులు అనుమతించలేదు. అంతేకాకుండా, గతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదాలు ఎక్కువగా వర్షాకాలంలోనే జరిగిన విషయం తెలిసిందే.