ఓటుకు నోటు కేసు విచారణ రోజుకో మలుపు తిరుగుతుంది..! అటు ఈ కేసులో ఫిర్యాదుదారుడు స్టీవెన్ సన్ మెజిస్ట్రేట్ ముందు తన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.
సినిమా కథ మాదిరిగానే ఓటుకు నోటు కేసులో ట్విస్టుల మీద ట్వీస్టులే ఉన్నాయ్..! రేవంత్ అరెస్టుతో ఇది ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. స్టీవెన్ సన్ తో ఏపీ సీఎం చంద్రబాబు టేపులు బయటపడడంతో ఈ వివాదం తారస్థాయికి చేరింది. దీంతో ఉమ్మడి రాజధానిలో ఏపీ పీఎం, మంత్రుల ఫోన్ల ట్యాపింగ్ ఆరోపణలతో మరో మలుపు తిరిగింది. ఆ తర్వాత సీన్ ఢిల్లీకి మారింది. ఏపీ సీఎం చంద్రబాబుతోపాటు, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ఏపీ విపక్ష నేత జగన్ కూడా హస్తిన బాట పట్టారు. హైదరాబాద్ లో ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు దీనిపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. చట్టవ్యతిరేకంగా తమ ఫోన్లను టీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాపింగ్ చేయడమేగాక..తమను బ్లాక్ మెయిల్ చేసి బెదిరిస్తోందని ఆయన ఆరోపించారు. ఏపీకి చెందిన సుమారు 120 మంది ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేశారన్న విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు సాక్ష్యాధారాలతో సహ అందజేశారు. దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ఇప్పటికే అంతర్గత విచారణకు ఆదేశించింది. ఒకటి రెండు రోజుల్లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి కూడా హైదరాబాద్ వస్తారని ప్రచారం జరుగుతోంది.
అటు గవర్నర్ తీరుపై కూడా కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసిందనే వార్తలు వచ్చాయ్..ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, రాజ్యాంగంలో కల్పించిన అధికారాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని ఉమ్మడి రాజధానిలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవ్వరి పని వారుచేసుకొనేలా చూడాలని తమను కలిసిన గవర్నర్ కు చెప్పినట్లు సమాచారం. గవర్నర్ ఢిల్లీ టూర్ తర్వాత అటు చంద్రబాబు నాయుడు, ఇటు కేసీఆర్ లతో సమావేశమవుతారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఇది జరగలేదు.
ఫోన్ ట్యాపింగ్ అంశంతోపాటు ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలకు సంబంధించి గవర్నర్ అధికారాలపై ఏపీ మంత్రులు గురి పెట్టారు. సెక్షన్ -8 ను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై గవర్నర్ సలహాదారులు ఏపీ సీఎం చంద్రబాబును కూడా కలిశారు. ఓటుకు నోటు కేసు అంశంతో కొంత టీఫెన్స్ లో పడిన ఏపీ సీఎం చంద్రబాబు ఎదురుదాడితో టీఆర్ఎస్ సర్కార్ ఖంగుతింది. సెక్షన్ - 8, ట్యాపింగ్ అంశంపై తెలంగాణ మంత్రులు దాటవేసే ధోరణిలోనే మాట్లాడారు. ట్యాపింగ్ జరగలేదని...చంద్రబాబు అవినీతి అంశాన్ని పక్కదారి పట్టించేందుకే ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారని ఎదురుదాడి చేశారు. అంతేకాదు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి టీఆర్ఎస్ సర్కార్ కూలిపోయేంతటి ఆధారాలను తాము సేకరించామని ఏపీ మంత్రులు మరో కౌంటర్ ఇచ్చారు. వీరిమాటలకు వంతపాడుతూ తెలంగాణ టీడీపీ నేత కొత్తకోట దయాకర్ రెడ్డి...మరికొన్ని గంటల్లో ఓ సంచలనం చోటుచేసుకోబోతుందని ప్రకటించారు. ట్యాపింగ్ కు సంబంధించి ఐదుగురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల పాత్రపై ఆధారాలు దొరికాయని వారిని తర్వలోనే అరెస్టు చేస్తారని తెలిపారు.
అయితే తెలంగాణ సర్కార్...ఏపీ మంత్రుల హెచ్చరికలకు తనదైన శైలీలో కౌంటర్ ఇచ్చింది. రాత్రికి రాత్రే ఇద్దరు టీడీపీ నేతలకు నోటీసులు జారీ చేసింది. ఆ వెంటనే ఎంపీ సీఎం రమేశ్ ను సైతం అరెస్టు చేస్తారనే పుకార్లు సైతం జోరుగా షికారు చేశాయ్. అయితే బుధవారానికి సీన్ రివర్స్ అయ్యింది. అరెస్టు చేస్తారనుకున్న వేం నరేందర్ రెడ్డిని ఏసీబీ అధికారులు వదిలివేశారు.
మరోవైపు ఓటుకు నోటు టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కేసులో ఫిర్యాదు దారుడు స్టీఫెన్‌సన్ వాంగ్మూలాన్ని సెక్షన్ 164 ఈఆర్‌సీసీ ప్రకారం బుధవారం కోర్టులో నమోదు చేశారు. నాంపల్లి కోర్టులో మూడో అదనపు మెట్రో పాలిటన్ మెజిస్ర్టేట్... స్టీఫెన్‌సన్ వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. స్టీఫెన్‌సన్‌తో పాటు ఆయన కుమార్తె జెస్సీకా, స్నేహితుడు మార్క్ టేలర్ వాంగ్మూలాన్ని కూడా మెజిస్ర్టేట్ నమోదు చేశారు.
ఇటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ కేసుపై దృష్టి పెట్టింది. ఈ కేసు దర్యాప్తును చివరివరకూ కొనసాగించాలని సూచిస్తూ ఎన్నికల సంఘం లేఖ పంపింది. పూర్తి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆ లేఖలో ఈసీ సూచించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్న భన్వర్‌లాల్ ఈ కేసుకు సంబంధించి పంపిన లేఖకు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రతిస్పందిస్తూ ఈ తాజా లేఖ పంపింది.