ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి జైల్లో పెట్టేందుకు ఇంతకుమించిన తరుణం మరొకటి లేదని, అందువల్ల ఆయన తప్పించుకునే అవకాశం ఇవ్వొద్దని వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి హస్తినలో గర్జించారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఆయనపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన అనంతరం జగన్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై దుమ్మెత్తిపోశారు.
ఈ వ్యవహారంలో చంద్రబాబుకు తప్పించుకునే అవకాశం ఇవ్వరాదని, నీచ రాజకీయాలకు పాల్పడే అలాంటి వ్యక్తి జైల్లో ఉంటేనే రాష్ట్రం బాగు పడుతుందన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఆడియోలో దొరికిపోయాడని, ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.5 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు ఎర వేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అలాంటి వ్యక్తిని వదిలిపెడతారా?... సామాన్యుడికి ఓ న్యాయం, సీఎంకు ఓ న్యాయమా? అని ప్రశ్నించారు.
ఈ కేసులో చంద్రబాబును ఏ1 నిందితుడిగా చేర్చే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. ఏపీలో లంచాల రూపంలో స్వీకరించిన సొమ్మునే తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనేందుకు లంచంగా ఇవ్వజూపారని జగన్ దుయ్యబట్టారు. లంచం ఇచ్చింది నీ ఎమ్మెల్యే, ఇవ్వమని చెప్పింది నువ్వు, ఫోన్‌లో నామినేటెడ్ ఎమ్మెల్యేతో మాట్లాడింది నువ్వు... మరి నన్నెందుకు ఈ విషయంలోకి లాగుతారు? అని జగన్ ప్రశ్నించారు.
మరోవైపు.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన జగన్... ఉభయ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు వ్యవహారాన్ని ప్రథమ పౌరునికి వివరించారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని, ఈ వ్యవహారంలో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా, చంద్రబాబు ఫోన్ సంభాషణలుగా భావిస్తున్న ఆడియో టేపులు వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది. దాంతో, ఆయనపై అటు ఏపీలో విపక్షాలు విరుచుకుపడుతుండగా, ఇటు తెలంగాణలో కేసులో నిందితుడిగా చేర్చేందుకు రంగం సిద్ధమవుతోంది.
https://www.youtube.com/watch?v=aY-UMKS7ea0