కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి రాజకీయాల నుంచి తప్పుకొవాలనుకుంటున్నారా. కాంగ్రెస్ లోఆయనకు ప్రాధాన్యం తగ్గడమే దీనికి కారణమా? రాజకీయాల్లో నైతిక విలువలు పతనమయ్యాయన్న ఆవేదన చెందుతున్నారా? లేదంటే... తన వారసుణ్ణి రాజకీయ ఆరంగ్రేట్రం చేయించాలని భావిస్తున్నారా?
కాంగ్రెస్ సీనియర నేత, మాజీ హోం మంత్రి, సీఎల్పీ నాయకుడు కుందూరు జానారెడ్డికి... రాజకీయల్లో అపార అనుభవం ఉంది. వ్యక్తిగతంగా వివాదాలకు దూరంగా ఉండే జానా రెడ్డి... పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అనేక కీలక పదవులను పొందారు. తెలంగాణలో అన్ని పార్టీల నేతలు... ఆయనను పెద్దమనిషిగా గౌరవిస్తారు. సీఎం కేసీఆర్ సైతం... జానారెడ్డి మాటకు విలువ ఇస్తారు. అయితే... సొంత పార్టీలో మాత్రం జానా అంటే బోల్డంత వ్యతిరేకత ఉంది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థి ఆకుల లలిత గెలిచిన తర్వాత ఆ క్రెడిట్ తనకే వస్తుందని జానా రెడ్డి భావించారు. కానీ అలా జరగలేదు. కొన్ని నెలలుగా పార్టీ అంతర్గత వ్యవహారాలతో అసంతృప్తిగానే ఉంటున్న జానా .... రేవంత్ వ్యవహారంతో తన మనసులోని బాధను వెళ్ళగక్కుకున్నారు. రాజకీయాల నుండి రిటైర్ కావాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఎప్పుడూ శాంతంగా ఉండే జానారెడ్డికి ఏమైంది. ఆయన అసహనానికి కారణం ఏమిటి? పార్టీలో తనకు ప్రాధాన్యం తగ్గిపోతోందని ఆవేదన చెందుతున్నారా? లేక తన వారసుణ్ణి రంగంలోకి దించేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా అనేది స్పష్టం కావాల్సి ఉంది.
వాస్తవానికి కొన్ని నెలలుగా కాంగ్రెస్ పార్టీలో చర్చంతా జానారెడ్డి పైనే. సార్వత్రిక ఎన్నికల తర్వాత సీఎల్పీ నాయకుడిగా జానారెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత... ఆయన వవహారశైలిపై ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా అధికారపక్షాన్ని దీటుగా ఎదుర్కోవాల్సిన జానా..... అసెంబ్లీలో అవకాశం దొరికినా సత్తా చాటలేకపోతున్నారని కాంగ్రెస్ కొత్త ఎమ్మెల్యేలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
అధికారపార్టీ తప్పులను ఎండగడుతూ ముందుకెళ్ళాలని పీసీసీ చీఫ్, వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యేలందరు డిసైడ్ చేసుకున్నా... జానా తీరు మారలేదని టీ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. బడ్జెట్‌పై ప్రభుత్వాన్ని ఏకిపారేస్తారని ఆశించిన ఎమ్మెల్యేలకు జానా తీరు ఇబ్బంది గా తయారైందని అప్పట్లో అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యేలు గుసగుసలాడుకున్నారు. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పోరాడుతుంటే ......నాయకుడిగా ముందుండి నడిపించాల్సిన జానారెడ్డి అసెంబ్లీలోనూ, బయటా మెతకవైఖరి ప్రదర్శించి పరువు తీస్తున్నారని పార్టీ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు.
సీఎల్పీ నాయకుడిగా దూకుడుగా వ్యవహరించట్లేదన్న కారణంగా జానారెడ్డిని పార్టీ వ్యవహారాల్లో గత కొన్ని నెలలుగా దాదాపు దూరం పెట్టేశారు. పీసీసీ అధ్యక్షుడి సొంత జిల్లాకు చెందిన వ్యక్తిగా జానారెడ్డి ఉన్నప్పటికీ ఆయనకు తెలియకుండానే చాలా విషయాలు జరుగుతున్నాయన్న ప్రచారం ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో తననెవరూ పట్టించుకోవట్లేదని జానారెడ్డి తన అనుచరుల దగ్గర వాపోయారని పార్టీ వర్గాల కథనం. పార్టీలోని అంతర్గత విషయాలతో విసిగివేసారిన జానారెడ్డి ఇక గౌరవంగా పదవీ నుండి తప్పుకొవాడమే మంచిది అనుకుంటున్నట్లు తెలుస్తోంది..
మరోవైపు కుమారుడిని క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకురావాలని జానారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. మొదట నల్గోండ జిల్లాలో తన వారసుడికి రాజకీయంగా గట్టి పునాదులు వేసి....ఆ తర్వాత పిసిసి స్థాయిలో మంచి స్థానాన్ని కల్పించాలని వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.