బెంగళూరు: అనర్హత వేటు పడిన, కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే సుధాకర్ ఈ రోజు ఉదయం కర్నాటక సీఎం యెడియూరప్పను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో
మాట్లాడుతూ... తన నియోజక వర్గ అభివృద్ధి కోసం మరిన్ని నిధులు కోరేందుకే సీఎంను కలిశానన్నారు. అందుకు సీఎం సానుకూలంగా స్పందించారని, మా నియోజకవర్గానికి తప్పకుండా సాయం చేస్తానని చెప్పారన్నారు. బీజేపీ ప్రభుత్వంలో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయన్న విషయంపై మాట్లాడుతూ... ఆ విషయంలో తనకే సమాచారం లేదన్నారు. అలాగే బీజేపీలో చేరడంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని... నా నియోజకవర్గ ప్రజలతో, కార్యకర్తలతో చర్చించిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకుంటానన్నారు. కాగా... ఆయనతో సహా రెబల్ ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్ రమేష్ కుమార్ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో జరగనున్న ఉప ఎన్నికల్లో రెబల్ ఎమ్మెల్యేలను ఓడిస్తామని కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై సుధాకర్ ఘాటుగా స్పందించారు. ఎన్నికల ఫలితాలను ప్రజలే నిర్ణయిస్తారు. కాంగ్రెస్ నేతలు కాదు. రాష్ట్రంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఒకే ఒక్క స్థానం దక్కింది అని అన్నారు. స్పీకర్ రాజ్యాంగానికి విరుద్ధంగా మాపై అనర్హత వేటు వేశారు. దీనిపై చట్టపరంగా పోరాటం చేస్తాం. సుప్రీంకోర్టుపై మాకు నమ్మకం ఉంది.. సుధాకర్ అన్నారు.