అమరావతి: విచ్చల విడిగా అప్పులు తెచ్చి, ఏపీ రాజధాని అమరావతిని ఐదేళ్లు గ్రాఫిక్స్ దశలోనే ఉంచారని మండిపడ్డారు వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు
విజయసాయి రెడ్డి. నిన్న ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పైవిజయసాయి ట్విట్టర్ వేదికగా స్పందించారు... 'తుఫాన్లు, కరువుకాటకాలతో అల్లాడిన వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ఊపిరి పోస్తుంది. 29 వేల కోట్ల కేటాయింపు రైతన్నలను సంక్షోభం నుంచి గట్టెక్కిస్తుంది. వడ్డీ లేని రుణం, ధరల స్థిరీకరణ నిధి, కౌలు రైతులకు పంట రుణాలు చరిత్రలో నిలిచి పోతాయి. జగన్ గారు రైతులకిచ్చిన మాట నిలుపుకున్నారు.'
'ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ప్రపంచంలోనే ఐదో పెద్ద సిటీ చేస్తామన్న అమరావతి గ్రాఫిక్స్ దశలోనే ఉంది. విచ్చల విడిగా అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని దివాలా తీయించారు చంద్రబాబు. కార్పోరేషన్లు, ప్రభుత్వ సంస్థల ద్వారా రుణంగా తెచ్చిన లక్ష కోట్లు ఏమయ్యాయో అంతుబట్టడం లేదు.'
'రైతు ఏ కారణంతో మరణించినా వారి కుటుంబానికి 7 లక్షల చెల్లించే బీమా పథకం దేశంలోని ఏ రాష్ట్రంలో లేదు. రైతన్నల పట్ల తనకున్న ఆపేక్షను జగన్ గారు ఈ బీమా స్కీమ్‌తో కనబర్చారు. ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబం నిశ్చింతగా జీవించడానికి ఇది భరోసా కల్పిస్తుంది.'
'వార్షికాదాయం 5 లక్షల వరకు ఉన్న మధ్యతరగతి కుటుంబాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం సాహసోపేత చర్య. రాష్ట్రంలోని మూడొంతులకు పైగా ప్రజలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తారు. మధ్యతరగతి ప్రజలకు కొండంత ధైర్యాన్నిచ్చింది.' అంటూ వరుస ట్వీట్లు చేశారు.