యువ ముఖ్యమంత్రి చేసిన సవాలుకు నలభై ఏళ్ల ఇండస్ట్రీ బెంబేలెత్తిపోయింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గురువారం ఈ దృశ్యం కనిపించింది.
వ్యవసాయానికి జీరో పర్సెంట్ రుణాలు ఇస్తున్నట్లు సీఎం జగన్ చేసిన ప్రకటనపై తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఇది కొత్త పథకమేమీ కాదని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. టీడీపీ సర్కారు హయాంలోనూ సున్నా వడ్డీకి రైతులకు రుణాలు ఇచ్చామన్నారు. ఈ మాత్రం దానికి గొప్పలు పోవడం ఎందుకన్నారు. విపక్ష నేత చంద్రబాబునాయడు కూడా చిరుదరహాసంతో తమ సభ్యుడు చెప్పింది కరెక్టే కదా అన్నట్లు చూశారు. దాంతో నేరుగా సీఎం జగన్ స్పందించారు. 2014 నుంచి సున్నా వడ్డీకే రైతులకు రుణాలు ఇవ్వకపోతే రాజీనామా చేస్తారా అని సవాలు విసిరారు. దానికి చంద్రబాబుతోపాటు టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు నేరుగా జవాబు చెప్పలేకపోయారు. చంద్రబాబు రాజీనామా చేయాలని, లేదా తన ఎమ్మెల్యేతో క్షమాపణ చెప్పించాలని శాసన వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కోరారు. దీంతో గందరగోళం చెలరేగింది. సీఎం జగన్ సవాలును మాత్రం చంద్రబాబు స్వీకరించలేదు.