అమరావతి: టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రం గత ఐదేళ్ల పాలనలో ఓవర్ డ్రాఫ్ట్ మీదే
బతుకీడ్చిందని, మాజీ సీఎం చంద్రబాబు పోతూపోతూ మన నెత్తిన అప్పుల కుప్పలు పెట్టి పోయారని దుయ్యబట్టారు. ఆనాడు వైసీపీ ప్రత్యేకహోదా కోసం డిమాండ్ చేస్తే మీకు సబ్జెక్ట్ తెలవదని చంద్రబాబు అవహేళన చేశారని ఈ సందర్భంగా బుగ్గన గుర్తుచేశారు. రాష్ట్రంలో విద్యుత్ లాంటి రంగాలు దివాళా తీశాయని, పౌరసరఫరాలాంటి శాఖల నిధులను పసుపు-కుంకుమ పథకాలకు వాడేశారని ఆరోపించారు. చంద్రన్న కానుకల కోసం ఖర్చుపెట్టిన సొమ్ముకూడా చంద్రబాబు భర్తీ చేయలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి రూ.3.62లక్షల కోట్ల అప్పు ఉందని తెలిపారు. ఏ ప్రభుత్వ శాఖలో చూసిన అప్పుల కుప్పలు పేరుకుపోయాయన్నారు. చంద్రబాబు కేవలం కాంట్రాక్టర్ల బిల్లులు మాత్రమే చెల్లించి పోయారని, అంగన్వాడీలు, హోంగార్డుల జీతాలను ఆయన పెండింగ్లో పెట్టారని రాజేంద్రనాథ్ విమర్శించారు.