హైదరాబాద్: జులై 10లోగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తయ్యేలా చూడాలని పార్టీ శ్రేణులకు, నేతలకు పిలుపునిచ్చారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈరోజు కేటీఆర్
ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కమిటీ ఇన్ ఛార్జిల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... మొక్కగా మొదలైన టీఆర్ఎస్ నేడు జిల్లా పరిషత్ లను కూడా క్లీన్ స్వీప్ చేసే స్థాయికి ఎదిగిందన్నారు. టీఆర్ఎస్ ను మరింత బలోపేతం చేసే దిశగా సభ్యత్వ నమోదు ప్రక్రియ జరగాలన్నారు. అలాగే సభ్యులందరూ పక్కాగా పత్రాలన్నీ పూర్తి చేస్తేనే వారికి భీమా వర్తిస్తుందన్నారు. సభ్యులు విధిగా నామిని పేరును వివరాలను జత చేయాలన్నారు. సభ్యత్వ నమోదు పూర్తికాగానే గ్రామ, మండల, వార్డులు, పట్టణ కమిటీలు ఏర్పాటు చేయాలని కేటీఆర్ సూచించారు. అన్ని కమిటీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 51 శాతం ప్రాతినిధ్యం ఉండేలా చూడాలన్నారు. టీఆర్ఎస్ ను క్యాడర్ బేస్ పార్టీగా తీర్చిదిద్దుదామన్నారు. ప్రభుత్వం, పార్టీపై బీజేపీ చేస్తోన్న దుష్ర్పచారాన్ని తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ సూచించారు. అలాగే... పార్టీ ప్రచారంలో సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకోవాలని పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు.