ఉత్తర అమెరికా తెలుగు సంఘం ముసుగులో తెలుగుదేశం పార్టీ భజన బృదం తానా... మహా సభల పేరుతో మళ్లీ హడావుడి మొదలు పెట్టింది. తెలుగు సంఘం అనేది
పార్టీలకు అతీతంగా ఉండాల్సింది పోయి, టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి జేబు సంస్ధగా మారిపోయి, ప్రధాన లక్ష్యాన్ని, ఆశయాన్ని మంటగలిపేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమపై పడిన పచ్చ ముద్రను చెరుపుకుని, తానాను అడ్డం పెట్టుకుని గత ఐదేళ్ల టీడీపీ హయాంలో చేసిన తప్పులకు పాప పరిహారం వెదుక్కునేందుకు తానా నిర్వాహకులు మహాసభల పేరుతో తతంగానికి తెరలేపారు. ఎన్నికల్లో ఓడిపోయిన నిరుత్సాహంతో ప్రతీ ఏడాది నిర్వహించే టీడీపీ మహాసభలను ఈ ఏడాది అకారణంగా చంద్రబాబు రద్దు చేశారు. టీడీపీ మహాసభ లేని లోటును తానా మహాసభ తీరుస్తుందనే ఉద్దేశంతో పచ్చపార్టీ నేతలంతా అమెరికాకు పోటెత్తుతున్నారు. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో జరిగిన అక్రమాల్లో మేము సైతం అంటూ చేయి కలిపిన అక్రమార్కుల కనుసన్నల్లో జరగబోయే ఈ పచ్చ పండుగ.. తెలుగు ప్రజలకు కాకుండా తెలుగు తమ్ముళ్ల కోసం నిర్వహించబోతున్నారని అమెరికాలోని మెజారిటీ తెలుగు ఎన్నారైలు దుమ్మెత్తి పోస్తున్నారు. చంద్రబాబు అక్రమాలపై నిగ్గు తేలుస్తానంటున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి తానా సభల వెనుక రహస్య అజెండాపై ఇంటెలిజెన్స్ సమాచారం ఉందని, నిన్నటి వరకు చంద్రబాబునాయుడుకు చెక్క భజన చేసే కోమటి జయరాం, సతీష్ వేమన వంటి ఊసరవల్లుల నేతృత్వంలో జరిగే ఈ మహాసభలపై ఆయనకు పూర్తి క్లారిటీ ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో తానా సభలకు వెళ్లేందుకు ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు సైతం జంకుతున్నట్లు సమాచారం.
చంద్రబాబు తప్ప ఇంకెవరు ముఖ్యమంత్రి అయినా ఏపీని అభివృద్ధి చేయలేరు. ప్రపంచ దేశాల్లోని తెలుగువారంతా మళ్లీ చంద్రబాబే సీఎం కావాలని కోరుకుంటున్నారు. ఏపీలో అభివృద్ధి ఆగిపోకుండా ఉండాలంటే మళ్లీ చంద్రబాబును సీఎంగా ఎన్నుకోవాలి... ఇవీ ఉత్తర అమెరికా తెలుగు సంఘం.. తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని స్తుతిస్తూ చేసిన వ్యాఖ్యలు. చీమలు పెట్టిన పుట్టల్లో పాములు చేరిన చందంగా... ఉన్నతాశయాలతో అమెరికాలోని కొందరు మహానుభావులు నెలకొల్పిన తానా... నేడు కొందరు రాజకీయ చెంచాగిరి చేసే బ్రోకర్ల చేతిలో కీలుబొమ్మగా మారిందన్న వాదన వినిపిస్తోంది. అమెరికాకు వచ్చేటప్పుడు కేరాఫ్ అడ్రస్ లేని వారంతా ఇప్పుడు తానాను అడ్డం పెట్టుకుని, అమెరికాలోని తెలుగు ప్రజల పేరును వాడుకుని కోట్లకు పడగలెత్తేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి కోమటి జయరాంను ముఖ్య ఉదాహరణగా వారు చూపిస్తున్నారు. సాదాసీదా వ్యక్తిగా అమెరికాకు వెళ్లి, తానాను అడ్డం పెట్టుకుని టీడీపీ అధినేత చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరించి అమెరికా తెలుగు వారందరినీ తెలుగుదేశం పార్టీకి తాకట్టుపెట్టిన ఘన చరిత్ర కోమటి జయరాంది. తానా అనేది ఓ స్వచ్ఛంద సాంస్కృతిక సంస్ధ అయినప్పుడు దానికి కులం, ప్రాంతం, పార్టీల రంగు పులమడం సరికాదన్న ఆలోచన లేకుండా, తెలుగువారి ఆత్మాభిమానం తెలుగుదేశం పార్టీకి దాసోహం అన్న చందంగా కోమటి జయరాం వ్యవహరించిన తీరు ఉత్తర అమెరికా తెలుగుసంఘానికి మాయని మచ్చగా మిగిలింది. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా ఎవరేమనుకున్నా చంద్రబాబుపై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ, ఆయనకు జై కొడుతూ, ఈ జయరాం పబ్బం గడిపేసుకున్నారని తెలుగు ఎన్నారైలు శాపనార్ధాలు పెడుతున్నారు. ఏపీలో అభివృద్ధికి తమ వంతు సహాయాన్ని అందించడానికి తెలుగు ఎన్నారైలు సిద్ధపడితే... వారి నుంచి తానా ద్వారా సేకరించిన విరాళాలను సైతం టీడీపీ తరపున పచ్చ చొక్కాలేసుకున్న తెలుగు తమ్ముళ్లకు మళ్లించారన్న ఆరోపణలు కూడా కోమటి జయరాంపై ఉన్నాయి. ఇలా అమెరికాలోని తెలుగు జనం డబ్బుతో తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూర్చినందుకు గుర్తింపుగా కోమటి జయరాంకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమెరికాలో ప్రభుత్వ ప్రతినిధి పదవిని కట్టబెట్టారు. ఇలా చంద్రబాబుకు చెంచాగిరి చేసిన కోమటి జయరాం నేతృత్వంలో ఇప్పుడు తానా సభలు జరగబోతున్న తానా సభల్లో పైకి అజెండా ఏదైనా లోలోపల మాత్రం టీడీపీ రహస్య అజెండా అమలవుతుందనడంలో సందేహం లేదు.
కోమటి జయరాంకు తాను ఏమాత్రం తీసిపోనని... చంద్రబాబు అడుగులకు మడుగులొత్తడంలో జయరాం కంటే తాను నాలుగు ఆకులు ఎక్కువే చదివానని తానా ప్రస్తుత అధ్యక్షుడు సతీష్ వేమన నిరూపించారు. చంద్రబాబును ప్రసన్నం చేసుకుని అమెరికాలో ఏపీ ప్రతినిధిగా ఛాన్స్ కొట్టేసేందుకు కోమటి జయరాం తెగ తాపత్రయపడి, చివరకు అనుకున్న పోస్టును దక్కించుకున్నారు. కోమటి జయరాం రూట్ లోనే వేమన సతీష్ కూడా స్కెచ్ వేశారు కానీ జయరాం కంటే ఇంకా పెద్ద పదవిని దక్కించుకోవాలని సతీష్ వేమన అత్యాశకుపోయారు. ఏకంగా రాజంపేట నుంచి టీడీపీ తరఫున పోటీ చేసేందుకు తగుదునమ్మా అంటూ సతీష్ వేమన సిద్ధపడ్డారంటే, తానాను ఏరకంగా తాకట్టు పెట్టేసి, తమ స్వార్ధ ప్రయోజనాల కోసం వాడుకున్నారో అర్థమవుతుంది. తానా నిర్వాహకులు ఎంత బరితెగించారో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. అసలు టీడీపీకి కొమ్ముకాయమని తానాలోని సభ్యులంతా కోమటి జయరాంకు, సతీష్ వేమనకు పేటెంట్ హక్కులు, పూర్తి అధికారాలు ఇచ్చారా? తానా తరఫున టీడీపీ తరఫున ప్రచారం చేయడానికి అందరి సభ్యుల ఆమోదం తీసుకున్నారా? ఈ ప్రశ్నలకు తానా నిర్వాహకుల నుంచి తగిన సమాధానం దొరకదు. సతీష్ వేమన ఓ అడుగు ముందుకేసి, చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్ష వైసీపీ నేతలు అనవసరంగా అవినీతి ఆరోపణలు చేస్తున్నారని, వారి ఆరోపణల్లో వాస్తవం లేదని రెచ్చిపోయి, మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ప్రతిపక్షాలు చేసే విమర్శలను లెక్క చేయకుండా ఏపీ జనం మళ్లీ చంద్రబాబునే సీఎంగా ఎన్నుకుంటారని సతీష్ వేమన జోస్యం చెప్పారు. అమెరికాలోని తెలుగు జనమంతా చంద్రబాబుకు అండగా నిలుస్తారని సతీష్ వేమన సెలవిచ్చారు. సతీష్ వేమన మాటలను బట్టిచూస్తే, చంద్రబాబు తప్ప ఏపీని ఎవరు పాలించినా అమెరికాలోని తెలుగు జనం అంగీకరించరన్నమాట. లక్షలాది మంది ఎన్నారైలకు ప్రతినిధులమని చెప్పుకునే తానా నిర్వాహకులు ఈ రకంగా బాధ్యతా రహితంగా, పక్షపాత ధోరణితో మాట్లాడటంపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. కోమటి జయరాంకైనా చంద్రబాబు భజన చేసినందుకు ఏదో నామినేటెడ్ పదవి దక్కింది. చంద్రబాబు మళ్లీ సీఎం అయితే చక్రం తిప్పొచ్చని కలలు కన్న సతీష్ వేమన డామిట్ కథ అడ్డం తిరిగిందని తల పట్టుకుంటున్నారు.
చంద్రబాబుపై అభిమానం చూపడంలో తప్పులేదు కానీ టీడీపీ అధినేతకు దాసోహమవ్వడాన్ని మాత్రం అమెరికా తెలుగు జనం అంగీకరించరు. కోమటి జయరాం, సతీష్ వేమన దృష్టిలో చంద్రబాబు జీవించినంత కాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు. మరో పదేళ్లు బాబుగారికి తిరుగుండదని అడ్డగోలు లెక్కలేసుకున్నారు. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి వారి లెక్క ఏరకంగా తప్పిందో లేటుగా బోధపడింది. కోమటి జయరాం.. సతీష్ వేమన వంటి కొందరు హిపోక్రసీతో చేసిన తప్పుల కారణంగా తానాలోని కొందరు తెలుగు వారి మైండ్ సెట్ కూడా అదే విధంగా ట్యూన్ అయిపోయింది. ఇప్పటికీ తానాలోని చాలా మంది సభ్యులు జగన్ ను సీఎంగా అంగీకరించలేకపోతున్నారు. తానాకు చెందిన కొందరు సభ్యులు అక్కడ పంపుతున్న వాట్స్ యాప్ మెసేజ్ లలో ఇప్పటికీ తమ దృష్టిలో చంద్రబాబే ఏపీ సీఎం అని, జగన్ కు ఏపీని పాలించే అర్హత, అనుభవం లేదని కొందరు తానా సభ్యులు వాట్స్ యాప్ లో తమ అక్కసును వెళ్లగక్కుతున్నారని ఉత్తర అమెరికాలోని కొందరు తెలుగు జనం వాపోతున్నారు. ఇంతలా వీరి ఆలోచనలను కోమటి జయరాం, సతీష్ వేమన వంటి పచ్చ పిచ్చి పట్టిన వారు ప్రభావితం చేశారన్నది వారి ఆరోపణ. ఈ విధంగా చంద్రబాబుకు కొమ్ముకాసిన తెలుగు ఎన్నారైలపై జగన్ దృష్టి పడిందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అధికారంలో ఉన్నంత కాలం చంద్రబాబు నామస్మరణలో తరించడమే కాకుండా...టీడీపీ హయాంలో జరిగిన అవినీతిని సైతం కప్పిపుచ్చే ప్రయత్నం చేసిన తానా నిర్వాహకుల నిర్వాకాన్ని జగన్ మర్చిపోరని, సరైన రీతిలో వారికి గుణపాఠం నేర్పుతారని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.
కేవలం చంద్రబాబు చెప్పుచేతల్లో పనిచేశారనే విమర్శలే కాకుండా తానా వ్యవస్ధీకృత లోపాలపై ఇప్పటికే మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. అమెరికాలో కూడా తెలుగు సంస్కృతిని, సాంప్రదాయాలను పెంపొందిస్తున్నామని చెప్పి, తానా మహాసభలను నిర్వహించడం ఆనవాయితీ. గత పదేళ్ల కాలంలో తానా సభలకు పంపే ఆహ్వాన పత్రికలను బ్రోకర్ల ద్వారా అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా తానా సభల్లో ఇచ్చే అవార్డులను లక్షల రూపాయలకు అమ్ముతున్నారనే వార్తలు వచ్చాయి. సినీ కళాకారులను పావులుగా వాడుకుని తానా నిర్వాహకులు అక్రమ దందాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. తానా సభల పేరుతో సేకరించిన విరాళాలపై కూడా లెక్క చెప్పే నాథుడు ఉండడు. ఎవరైనా తానా సభ్యులు తెగించి, విరాళాల లెక్కలు అడిగితే వారి అంతు తేల్చే వరకు తానా పెద్దలు నిద్రపోరని చాలా మంది బాధితులు వాపోతున్నారు. తానా నిర్వాహకులుగా పదవులు చేపట్టక ముందు కోమటి జయరాం, సతీష్ వేమన వంటి ఎన్నారైలు ఆస్తులు ఎంత ఉండేవో, ఇప్పుడు అమాంతంగా అవి ఎలా పెరిగిపోయాయో తేల్చేందుకు వీరంతా బహిరంగ చర్చకు సిద్ధపడాలని తానాకు చెందిన ఓ వర్గం సవాల్ విసురుతోంది. మరి కొందరు ఉత్తర అమెరికా ఎన్నారైల వాదన వింటే..చంద్రబాబునాయుడు కూడగట్టిన బ్లాక్ మనీని కోమటి జయరాం, సతీష్ వేమనల వంటి వారి ద్వారా అమెరికాకు తరలించారని, ఏపీలో టీడీపీ అధినేత తీగ లాగితే, అమెరికాలో డొంక కులుతుందని వీరి గుట్టు విప్పుతున్నారు. పొంతన లేని ప్రకటనలు చేసి, ఎన్నారై నిధులతో ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని తానా నిర్వాహకులు మీడియాలో ప్రచారం చేసుకున్నారు కానీ ఇంత వరకు చెప్పుకో దగ్గ పని ఏదీ జరగలేదు. మరి ఈసారి జరగబోయే తానా మహాసభల్లో ఎలాంటి వింతలు, విడ్డూరాలు ఉండబోతున్నాయో వేచి చూడాలి.