అధికార దాహంతో, విలువలకు తిలోదకాలిచ్చి, నమ్మిన వారిని నట్టేట ముంచి, విచక్షణా రహితంగా చేసిన తప్పులు ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడ్ని
నీడలా వెంటాడుతున్నాయి. అపర చాణక్యుడిగా తెలుగు తమ్ముళ్లు చెక్క భజన చేసిన చంద్రబాబు ఇప్పుడు చక్రబంధంలో ఇరుక్కున్నారు. గతంలో చంద్రబాబు చేసిన పాపాలు, ఇప్పడు సైకిల్ పార్టీకి శాపాలుగా మారుతున్నాయి. నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా.. అన్న చందంగా నిన్నటి వరకు అధినేతకు జై కొట్టిన టీడీపీ రాజ్యసభ ఎంపీలు, ఇప్పుడు సైకిల్ పంక్చర్ అవడంతో కాషాయ కండువా కప్పేసుకుని చంద్రబాబుకు టాటా చెప్పేశారు. ఐదుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీలలో నలుగురు బీజేపీ పార్లమెంటు పార్టీలో విలీనమయ్యేందుకు ఆమోదం తెలుపుతూ, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడుకి లేఖ ఇచ్చేశారు.
దీంతో తెలంగాణతో పాటూ రాజ్యసభలో కూడా టీడీపీ దుకాణం బంద్ అయిపోయింది. ఏపీ రాజకీయాల్లో దీన్ని ఒక కీలక పరిణామంగా భావించక తప్పదు. ఒకరకంగా చెప్పాలంటే, ఎన్నికల్లో ఓడిన తర్వాత చంద్రబాబు నాయుడుకు బీజేపీ హైకమాండ్ చుక్కులు చూపించేందుకు ట్రైలర్ స్టార్ట్ అయ్యిందనే భావించాలి. ప్రత్యర్ధులు విసిరే సవాళ్లను ఎదుర్కోవడంలో తనకు ఎవరూ సాటిలేరని, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ తెగ బిల్డప్ లు ఇచ్చుకునే చంద్రబాబు కమలనాధులు సంధిస్తున్న బాణలతో చేష్టలుడిగి, విలవిలలాడిపోతున్నారు. అసలే ఓటమి భారంతో కుంగిపోయిన బాబు అండ్ కో ఇటు ఏపీ సీఎం జగన్ దూకుడ్ని, అటు బీజేపీ పన్నుతున్న వ్యూహాలను తట్టుకోలేక చెట్టుకొకరు, పుట్టకొకరు అన్న చందంగా దిక్కుతోచక అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రస్తుతం టీడీపీ ఎదుర్కుంటున్న ఈ దయనీయ స్ధితికి చంద్రబాబు స్వయంకృత అపరాధాలే ప్రధాన కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మెజార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు తనకు మద్దతివ్వడంతో తాను ఏం చేసిన చెల్లుతుందన్న బరితెగింపుతో చంద్రబాబు చేసిన అరాచకాలు అన్నీ, ఇన్నీ కావని ఆయన ప్రత్యర్ధులు గత చరిత్రను తిరగదోడుతున్నారు. ప్రస్తుతం టీడీపీకి చెందిన మెజారిటీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనమైన తరుణంలో గతంలో ఇదే తరహాలో చంద్రబాబు నడిపిన కుట్ర రాజకీయాల తీరును వారు గుర్తు చేస్తున్నారు. 1995లో అన్న ఎన్టీఆర్ ను వెన్నుపోటు రాజకీయాలతో గద్దెదించడమే కాకుండా, టీడీపీని హస్తగతం చేసుకున్న చంద్రబాబు తప్పులు ఇప్పుడు ఆయనను నీడలా వెంటాడుతున్నాయి. ఆగస్టు సంక్షోభ సమయంలో ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడ్ని చేయడమే కాదు... 2014లో ఎన్నికల్లో గెలిచిన తర్వాత అనైతికంగా వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్న తీరుకూడా ఇప్పడు టీడీపీకి శాపంగా మారింది. మీరు చేస్తే పవిత్రం... మేము చేస్తే అపవిత్రమా అంటూ ప్రస్తుతం కమలనాధులు చంద్రబాబునాయుడ్ని నిలదీస్తున్నారు. దీంతో నోరు మెదపలేని స్ధితిలో మొక్కుబడిగా విమర్శలు చేస్తూ, టీడీపీ నేతలు మిన్నకుండిపోయారు.
గతంలో చంద్రబాబు నాయుడు తన మంది, మార్బలాన్ని చూసుకుని చేసిన తప్పులు ఒకటి, రెండూ కాదు... లెక్కలేనన్ని తప్పులు చేసి, సత్య హరిశ్చంద్రుడికి తమ్ముడిలా గొప్పలు చెప్పుకునే చంద్రబాబు... నాడు చేసిన తప్పులకు నేడు అసలుతో పాటూ వడ్డీతో సహా మూల్యం చెల్లించుకుంటున్నారని ఆయన బాధిత సంఘం దుమ్మెత్తి పోస్తోంది. చంద్రబాబు గతంలో చేసిన తప్పులు, ఇప్పుడు వాటి పర్యవసానాలను అనుభవిస్తున్న తీరును చూస్తే చాలా వింతగా ఉంటుంది.
నాడు... నేడు
- నాడు... టీడీపీ వ్యవస్ధాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి, 1995లో చంద్రబాబు టీడీపీని హస్తగతం చేసుకున్నారు.
- నేడు... చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచి టీడీపీ రాజ్యసభ ఎంపీలు నలుగురు బీజేపీలో చేరిపోయారు.
- నాడు... అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి హోదాలో యూరప్ టూర్ లో ఉన్నప్పుడు చంద్రబాబు స్కెచ్ వేసి, ఆయనను గద్దె దించడానికి రంగం సిద్ధం చేశారు.
- నేడు... చంద్రబాబు యూరప్ టూర్ లో ఉన్నప్పుడు, టీడీపీ రాజ్యసభ ఎంపీలు బీజేపీ కండువా కప్పుకున్నారు.
- నాడు... అసెంబ్లీ స్పీకర్ గా యనమల రామకృష్ణుడుని అడ్డం పెట్టుకుని, చంద్రబాబు మెజారిటీ సభ్యుల బలంతో ఎన్టీఆర్ ను దెబ్బకొట్టారు
- నేడు... కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ... టీడీపీకి చెందిన మెజారిటీ రాజ్యసభ ఎంపీల నిర్ణయంతో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ద్వారా విలీన ప్రక్రియను పూర్తి చేసింది.
- నాడు... 70ఏళ్ల వయస్సులో ఎన్టీఆర్ పై వెన్నుపోటు రాజకీయాలను చంద్రబాబు ప్రోత్సహించారు.
- నేడు... టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా ప్రస్తుతం 70ఏళ్లు నిండిన తరుణంలో ఆయనపై సొంత పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీలు తిరుగుబాటు చేశారు.
- నాడు... 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ ఎంపీ ఎస్పీవై రెడ్డితో పాటు మరో ఇద్దరు వైసీపీ ఎంపీలు టీడీపీ కండువా కప్పుకున్నారు. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కూడా టీడీపీలో చేర్చుకుని, వారిలో నలుగురికి నిబంధనలకు విరుద్ధంగా మంత్రి పదవులు ఇచ్చారు.
- నేడు... కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చంద్రబాబు అనుసరించిన వ్యూహాన్ని ఫాలో అవుతూ టీడీపీ రాజ్యసభ సభ్యులను తమ వైపు లాగేసుకుంది.
- నాడు... వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడం, అనైతికం, అధర్మమని ప్రతిపక్ష నేత వైఎస్. జగన్ అరిచి గీపెట్టినా, టీడీపీ నేతలు పట్టించుకోలేదు. అభివృద్ధి కోసం పార్టీ మారామని అప్పటిలో వైసీపీ ప్రజా ప్రతినిధులు చెప్పారు.
- నేడు... బీజేపీ నుంచి తమపై ఒత్తిడి లేదని, ఏపీ అభివృద్ధి కోసమే తాము పార్టీ మారుతున్నమని ఇప్పుడు కాషాయ కండువా కప్పుకున్న టీడీపీ రాజ్యసభ ఎంపీలు కారణం చూపుతున్నారు.