అమరావతి: సీఎం వైఎస్ జగన్ తో జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు భేటీ అయ్యారు. ఈరోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఎమ్మెల్యే వరప్రసాద్ శాసన సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం సీఎం ఛాంబర్‌కు వెళ్లి సీఎం జగన్ తో భేటీ అయ్యారు. సీఎం ఛాంబర్ నుంచి బయటకు వచ్చిన అనంతరం వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ... తాను మర్యదాపూర్వకంగానే సీఎం జగన్‌ను కలిశానన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో రాజోలు నుంచి జనసేన పార్టీ తరపున పోటీ చేసిన రాపాక వరప్రసాద్ రావు ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా... ఆయన జనసేన పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే కావడంతో పైగా ఈరోజు సీఎం జగన్ తో ప్రత్యేకంగా భేటీ కావడంతో వరప్రసాద్ అధికార వైసీపీ పార్టీలో చేరబోతున్నారనే ఊహాగాలు వచ్చాయి. అయితే తాను జనసేనలోనే ఉంటానని పార్టీ మారనని వరప్రసాద్ స్పష్టం చేశారు.