గుంటూరు: జనసేన పార్టీకి రావెల కిశోర్ బాబు రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు పంపారు. తన వ్యక్తిగత కారణాలతోనే
పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో రావెల పేర్కొన్నారు. 2018లో టీడీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన రావెల గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. దీంతో జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు పవన్‌కు లేఖ రాశారు. అంతకుముందు 2014 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచే పోటీ చేసి గెలుపొందిన ఆయన చంద్రబాబు హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే... కొన్నాళ్ల తరువాత మంత్రి పదవి పోవడంతో, అసహనంతో టీడీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఇప్పుడు జనసేనకు కూడా రాజీనామా చేశారు. అయితే... ఈసారి రావెల బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్టు సమాచారం. అందులో భాగంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణను కలిసిన రావెల రేపు ప్రధాని మోడీ తిరుపతి పర్యటనలో బీజేపీలో చేరనున్నారని సమాచారం. రావెలతో పాటు పలువురు మండల స్థాయి నేతలు కూడా రేపు కమలం గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది.