హైదరాబాద్: ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. నగరంలోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించేందుకు వచ్చిన ఆయన సతీమణి లక్ష్మీపార్వతి
అక్కడి ఏర్పాట్లపై అసహనం వ్యక్తం చేశారు. ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయం టీడీపీ పార్టీ స్థాపించి పాలన సాగించిన ఎన్టీఆర్ జయంతి రోజున కనీసం ఒక్క బ్యానర్ కూడా ఏర్పాటు చేయలేదంటూ ఆగ్రహించారు. చంద్రబాబునాయుడు ఎన్నికల్లో ఓటమి చెందడంతో ఎన్టీఆర్ ఆత్మ శాంతించిందని, చంద్రబాబు చేసిన అన్యాయాలు కుట్రల వల్ల తగిన శాస్తి జరిగిందని మండిపడ్డారు. తానెప్పుడు టీడీపీకి వ్యతిరేకం కాదని.. చంద్రబాబు అనే వ్యక్తికి మాత్రమే వ్యతిరేకమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ.. ఏపీకి కాబోయే సీఎం జగన్ సరిదిద్దుతారన్న నమ్మకం తనకు ఉందన్నారు. అయితే... లక్షిపార్వతి మాట్లాడుతుండగా ఇక్కడ రాజకీయాలు మాట్లాడితే సహించేది లేదంటూ చంద్రబాబు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు అడ్డుపడ్డారు. ఈక్రమంలో జై ఎన్టీఆర్ - జై చంద్రబాబు అంటూ అభిమానులు పోటాపోటీగా నినాదాలు చేశారు.