విశాఖపట్నం: విశాఖపట్నం ఉత్తర టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాస రావు 1,944 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచినట్లు ఈసీ అధికారికంగా ప్రకటించింది. ఆ నియోజకవర్గ
పరిధిలోని 42 వ పోలింగ్ కేంద్రంలోని వీవీ ప్యాట్ స్లిప్పులు, ఈవీఎం నెంబర్ మధ్య వ్యత్యాసం ఉండటంతో వైసీపీ అభ్యర్థి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫలితంపై గురువారం అర్ధరాత్రి నుంచి తీవ్ర ఉత్కంఠత నెలకొన్న విషయం తెలిసిందే. 42వ పోలింగ్బూత్ లో గల వీవీప్యాట్లో 371 ఓట్లు పోలైతే 107 ఓట్లు మాత్రమే పోలైనట్లు చూపిస్తుండటంతో వైసీపీ అభ్యర్థి కేకే రాజుతో పాటు ఆ పార్టీ ఏజెంట్లు తీవ్ర అభ్యంతరం తెలిపారు. అయితే ఆ వీవీప్యాట్లలో గల ఓట్లను కేకే రాజుకు కలిపినా కూడా.. గంటా శ్రీనివాసరావుకే ఆధిక్యం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ విషయంలో ఈసీని సంప్రదించి గంటా విజయాన్ని ఎన్నికల అధికారులు ఈరోజు అధికారికంగా ప్రకటించారు.