మోదీకి జ్ఞానం తక్కువ....అహంకారం ఎక్కువ అని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి జైపాల్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ బీహార్‌లో తక్షశిల, నలంద ఉందన్న మోదీకి చరిత్రే కాదు జాగ్రఫీ కూడా తెలియదని ఎద్దేవా చేశారు.
ఐఐటీ గురించి పరిజ్ఞానం లేని మోదీకి ప్రవాసభారతీయులు స్వాగతం చెబుతున్నారన్నారు. బీజేపీలో ఆడ్వాణీని మమ్మీగా, సుష్మాను డమ్మీగా మార్చారని విమర్శించారు. సుష్మాస్వరాజ్‌ను రాజకీయంగా దేశబహిష్కరణ చేశారని జైపాల్ వ్యాఖ్యానించారు. అసాధ్యమైన హామీలు ఇవ్వడంలో మోదీ, కేసీఆర్ ఒక్కటే అని మండిపడ్డారు. భూసేకరణ బిల్లును కేసీఆర్ ఎందుకు సమర్థిస్తున్నారని ఆయన నిలదీశారు. భూసేకరణబిల్లుపై కోర్టులో మోదీకి ఓటమి తప్పదని జైపాల్‌రెడ్డి పేర్కొన్నారు.