ఓ వైపు సెక్షన్ - 8, గవర్నర్ అధికారాలపై జగడం ఇంకా సద్దుమణగనే లేదు...తాజాగా విభజన చట్టం 9,10 షెడ్యూల్ లో ఉన్న సంస్థలపై ఇరు రాష్ట్రాల మధ్య సరికొత్త లొల్లి మొదలైంది. అంతేకాదు విభజన సమస్యల పరిష్కారానికి తెలంగాణ సీఎంతో చర్చించేందుకు తాను సిద్ధమని ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ప్రకటించారు..! మరి ఇద్దరు సీఎంలోను కూర్చోబెట్టి సమస్యలను పరిష్కారానికి గవర్నర్ నరసింహన్ చొరవ చూపుతారా?
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని 10వ షెడ్యుల్ లో పేర్కొన్న 107 సంస్థలపై పెత్తనం కోసం ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య మళ్లీ రగడ మొదలైంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటి నుంచి సంవత్సరంలోగా ఈ సంస్థలపై ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రావాలని...విభజన చట్టంలో నిర్దేశించారు. ఈ 107 సంస్థల సేవలను ఇరు రాష్ట్రాలు ఎలా ఉపయోగించుకోవాల్సింది విభజన చట్టం సెక్షన్ 75 కింద పేర్కొన్నారు. తాజాగా హైదరాబాద్ లో ఉన్న సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ జనరల్ గా తమ రాష్ట్రానికి చెందిన ఓ ఐఏఎస్ అధికారిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఉన్నతా విద్యమండలిపై హైకోర్టు తీర్పును అనుసరించి 10వ షెడ్యూల్ లో పేర్కొన్న సంస్థలు ఏ రాష్ట్ర భూభాగంలో ఉంటే ఆ రాష్ట్రానికే అధికారం ఉంటుందని..వాటి నిర్వహణ, అధికారుల నియామకం, అజమాయిషీ అంతా ఆ రాష్ట్రాలకే ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ లెక్క ప్రకారం షెడ్యూల్ 10లో ఉన్న 97 సంస్థల నిర్వహణ తమ దేనని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. దీంతో ఈ షెడ్యూల్ లోని సంస్థలపై మళ్లీ వివాదం మొదలైంది. తెలంగాణ ప్రభుత్వం ఈ షెడ్యూల్ లో ఉన్న సంస్థలకు సంబంధించిన సమీక్ష సమావేశం కూడా నిర్వహించింది.
అటు 9 ,10 షెడ్యూల్ సంస్థలపై తెలంగాణ ప్రభుత్వం వ్యవహారిస్తున్న తీరుపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన సమస్యలపై కలిసి కూర్చుని మాట్లాడుకుందామని తెలంగాణ సీఎంకు తాను విజ్ఞప్తి చేసినా కూడా తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన అన్నారు. ఇద్దరం కలిసి కూర్చుంటే ఆమోదయోగ్యమైన పరిష్కారం వస్తుందని బాబు అభిప్రాయపడ్డారు.
మరోవైపు విభజన సమస్యలపై తాను ఇప్పటికి 23 సార్లు గవర్నర్‌ను కలిశానని అయినా ఎటువంటి ఫలితం లేకుండా పోయిందని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలంటే తెలంగాణ ప్రభుత్వానికి ఇసుమంతైనా గౌరవంలేదని విమర్శించారు. విభజన చట్టంపై తెలంగాణ ప్రభుత్వం వితండవాదం చేస్తోందని, లక్షలాదిమంది విద్యార్థులతో ఆటలాడుతోందని అన్నారు. శత్రుదేశం కూడా ఇలా చేయదని గంటా వ్యాఖ్యానించారు. సెక్షన్-8 కూడా అమలు చేయకుంటే హైదరాబాద్‌ను యూటీ చేయాల్సిన పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు.
ఇప్పటికైనా గవర్నర్ తనకున్న విశేషాధికారులను ఉపయోగించి విభజన సమస్యల పరిష్కారానికి చొరవ చూపాల్సిన అవసరం ఉంది. గతంలో విభజన సమస్యల పరిష్కారానికి రాజ్ భవన్ వేదికగా ఇద్దరు సీఎంలను కలిపిన గవర్నర్ నరసింహన్ మరోసారి ఇద్దరు చంద్రులను కలపాలని ప్రజలు కోరుతున్నారు.