సెక్షన్ -8 అమలును ఒప్పుకునేది లేదు..! అవసరమైతే జాతీయ స్థాయిలో పోరాడుతామని తెలంగాణ మంత్రులు ఒకింత హెచ్చరిక స్వరంతోనే చెబుతున్నారు...!
మరోవైపు సెక్షన్- 8 లేదంటే అసలు విభజననే ఒప్పుకొమంటున్నారు ఏపీ మంత్రులు...? ఇంతకీ గవర్నర్ స్టాండ్ ఏమిటీ? రాష్ట్ర విభజన జరిగిన ఏడాది అయ్యింది. రెండు రాష్ట్రాల్లో కూడా తొలి అవతరణ దినోత్సవాలు ఘనంగానే జరిగాయ్. అయితే ఈ ఏడాది పాలనలో కాలంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు కామన్ అయ్యాయి. ఉమ్మడి ఎంసెట్ తో మొదలైన వివాదాలు ఆ తర్వాత ఇతర అంశాలకు పాకాయ్. నీరు వివాదం...తీరు వివాదం.. పేరు వివాదం..విద్యుత్ వివాదం...! ఒకటేమిటి అడుగు తీసి అడుగు వేస్తే వివాదాలే..! ఉమ్మడి అంశాలపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలపై కూడా వివాదాలు...వాటిపై పరస్పర విమర్శలు...వాదోపవాదాలు నిత్యకృత్యంగా మారాయ్. కలిసి మెలిసి సాగాల్సిన రెండు ప్రభుత్వాలు మా వాదన కరెక్టు అంటే మా వాదన కరెక్టు అంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నాయ్. ఒక దశలో సాగర్ ప్రాజెక్టు వద్ద ఇరు రాష్ట్రాల పోలీసులు బాహబాహీకి దిగిన ఘటనలు కూడా జరిగాయ్. ఈ పంచాయితీలను పలు మార్లు, గవర్నర్ వద్దకు అటు కేంద్రం వద్దకు ఇటు న్యాయస్థానాల ముందుకు తీసుకువెళ్తేగాని సద్దుమణగడం లేదు..!
ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు సమన్యాయం చేయాల్సిన గవర్నర్...ఒకింత తెలంగాణకు అనుకూలంగా వ్యవహారిస్తున్నారని పలు మార్లు ఏపీ మంత్రులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. తమ అభ్యంతరాలను బుట్టదాఖలు చేస్తూ...తెలంగాణకు వంతపాడుతున్నారని ఆరోపించారు. గవర్నర్ తీరుతో ఉన్న సమస్యలు పరిష్కారం కాకపోగా సరికొత్త సమస్యలకు ఉత్పన్నమవుతున్నాయని వాపోతున్నారు.
తాజాగా ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్టు, చంద్రబాబు టేపులు విడుదల కావడంతో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. ఏపీ సీఎం చంద్రబాబు....తెలంగాణ సీఎం తీరుపై ఫైర్ అయ్యారు. ఉమ్మడి రాజధానిలో తమ ఫోన్లను...ఎలాంటి అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్ చేయడం నేరమని తెలిపారు. రాజధానిలో తమ కదలికలపై నిఘా వేస్తున్నారని కేంద్రానికి ఫిర్యాదు కూడా చేశారు. ఇప్పటికే ఈ ట్యాపింగ్ లపై కేంద్రం కూడా అంతర్గత విచారణకు ఆదేశించింది. ట్యాపింగ్ లకు సంబంధించిన పూర్తి ఆధారాలను సైతం ఏపీ సీఎం కేంద్రానికి అందించారు. అంతేకాదు చంద్రబాబు మాట్లాడినట్లుగా చెబుతున్న టేపులను మొదట ప్రసారం చేసిన ఓ చానల్ కు ఏపీ పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పై నమోదు అయిన కేసులపై సిట్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా అంతే దూకుడుగా ఓటుకు నోటు కేసులు ముందుకు వెళుతోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం సెక్షన్ -౮ అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఉమ్మడి రాజధానిలో తమకు రక్షణ లేదని...తమ ఫోన్ లు ట్యాపింగ్ చేస్తున్నారని వెంటనే సెక్షన్ ఎనిమిదిని అమలు చేయలని డిమాండ్ చేస్తున్నారు. ఇటు గవర్నర్ తీరుపై కూడా ఏపీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం విమర్శలు ఎలా ఉన్న గవర్నర్ మాత్రం తాను చట్టప్రకారమే తన విధులు నిర్వహిస్తున్నానని చెబుతున్నారు. శుక్రవారం నాడు ఢిల్లీలో హోంశాఖ ఉన్నతాధికారులతో జరిగిన భేటీలో కూడా సెక్షన్ -8 అంశంపై చర్చ జరిగినట్లు చెబుతున్నారు. ఈ సెక్షన్ ద్వారా సక్రమించిన విశేషాధికారులకు ఉపయోగించి పరిస్థితులు చక్కదిద్దే అవకాశమున్నా కూడా ప్రతి అంశానికి గవర్నర్ ఢిల్లీ వెపు చూడడం ఏమిటని...ఢిల్లీ పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం.