ఇది తెలుగు రాష్ట్రాల అంతులేని కథ..! విభజన జరిగి ఏడాది గడిచింది..! జగడాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయ్..! ఓటుకు నోటు కేసు, చంద్రబాబు టేపులతో మొదలైనా వివాదం....
ఆ తర్వాత పలు మలుపులు తిరిగి ఉమ్మడి రాజధానిలో ఫోన్ ట్యాపింగ్ తెరపైకి వచ్చింది. తాజాగా సెక్షన్ -8, గవర్నర్ అధికారాలపై రచ్చ జరుగుతోంది.!ఉమ్మడి గవర్నర్ గా రెండు రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన గవర్నర్ నరసింహన్ తెలంగాణ అంటే కొంచెం మక్కువ చూపిస్తున్నారని...ఏపీ మంత్రులు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. గవర్నర్ వ్యవహారశైలిపై రెండు వారాల క్రితం ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా గవర్నర్ నరసింహన్ ఆకస్మికంగా ఢిల్లీకి వెళ్లి వచ్చారు. ఢిల్లీ పర్యటన విశేషాల గురించి విలేకరులు గుచ్చిగుచ్చి ప్రశ్నించగా తాను చెప్పడానికేమి లేదని నరసింహన్ దాటవేశారు. సెక్షన్ -౮,సహా యాదాతథస్థితి కొనసాగుతుందని ఆయన ముక్తయించారు. అంతకు మించి పెదవి విప్పడానికి గవర్నర్ నిరాకరించారు. గవర్నర్ మాటరాని మౌనం..! ఇదే ఇవాళ్టి బిగ్ స్టోరీ.
గవర్నర్ అంటే...అటు కేంద్రానికి ఇటు రాష్ట్రానికి వారధి..! అంతేకాదు రాజ్యాంగ ప్రతినిధి..! ఆ రాష్ట్రానికి మొదటి పౌరుడు కూడా..! ఇక అసలు విషయానికి వస్తే.., ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా నరసింహన్ ది పెద్ద బాధ్యత...! విభజన సమస్యలను పరిష్కారించాల్సిన ఆయన మౌన ప్రేక్షకుడిగా మారిపోయారా..? ప్రతి విషయానికి ఢిల్లీబాట పడుతున్నారా?
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఓటుకు నోటు వ్యవహారం...అంతులేని, ముగింపునకు చేరని తెలుగు టీవీ సీరియల్ లా అనంతంగా కొనసాగుతూనేవున్నది.
ఉభయ రాష్ట్రాల్లో రాజకీయ నాయకుల దృష్టంతా ప్రస్తుతం ఈ అంశంపైనే. దర్యాప్తు సంస్థలపై వీరికి విశ్వాసంవున్నట్లు కనిపించదు..! అంతిమంగా న్యాయస్థానాలకు కూడా రాజకీయ మకిలిని అంటించడానికి వీరు శతవిధాల యత్నిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో నెలకొనివున్న ప్రశాంత పరిస్థితులు వీరికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయ్. తెలుగు ప్రజలు కొట్టుకు చస్తుంటేనే వీరికి కళ్ళు చల్లబడేటట్టున్నాయ్. కాని ఆ ప్రజలు విచక్షణాయుతమయిన, విజ్ఞతతో కూడిన తీర్పే తమనీ స్థాయిలో వుంచిందన్న కనీస స్పృహ వీరికి కొరవడడం తెలుగు ప్రజల దురదృష్టం.
ఈ వరుస వివాదాల నేపథ్యంలో ఉభయ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇ.ఎస్.ఎల్ నరసింహన్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన సర్వత్రా ఉత్కంఠ రేకెత్తించింది. దిశా నిర్దేశం కోసం ఆయనను ఢిల్లీ....పిలిపించారని ఓ వైపు ప్రచారం...కాదు కాదు గవర్నర్ నే మార్చేస్తున్నారంటూ మరోవైపు ఊహగానాలు, అన్నింటికీ తెర దించుతూ నరసింహన్ ఢిల్లీ వెళ్లను వెళ్లారు. హైదరాబాద్ కు తిరిగి రానూ వచ్చారు. విభజనంలోని సెక్షన్ 8 సహా అన్ని సమస్యలను పరిష్్కరించవలసిన బాధ్యత గవర్నర్దేనని ఢిల్లీ పెద్దలు ఆయనకు స్పష్టీకరించినట్లు సమాచారం.
తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలను తమ వరకు తీసుకు రావద్దని సాధ్యమయినంత వరకు వాటిని స్థానికంగానే పరిష్కరించుకోవాలని, తద్వారా ఉభయ రాష్ట్రాల్లో సుహృద్భావ పూర్వకమయిన స్నేహపూరిత వాతావరణం నెలకొనేలా చూడవలసిన గురుతర బాధ్యత గవర్నర్ దేనని హితవచనాలు కూడా పలికినట్లు వినికిడి.
అటు రెండు వారాల క్రితమే ఢిల్లీ వచ్చిన నరసింహన్...అప్పట్లో ఇద్దరు సీఎంలతో భేటీ అవుతారని భావించారు. ఓటుకు నోటు కేసు తర్వాత ఉత్పన్నమైన అన్ని వివాదాలకు ఓ పరిష్కారం కనుగోంటారని కేంద్ర పెద్దలు భావించారు. ఈ సమస్యలను ఇలాగే నాన్చడంతో కొత్త సమస్యలు తలెత్తున్నాయని కేంద్ర పెద్దలు...ఆయనపై ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.!
హోంశాఖ వర్గాలతో భేటీ తర్వాత...విలేకరులు ప్రశ్నించిన ఆయన ముక్తసరి సమాధానాలతోనే ప్రశ్నలను దాటవేశారు. ఇంతకీ గవర్నర్ మౌనం వీడేది ఎప్పుడు..! రాజ్యాంగ ప్రతినిధిగా...రాష్ట్రాధిపతిగా....తెలుగు రాష్ట్రాల సమస్యలు పరిష్కరించేది ఎప్పుడని ప్రజలు ఎదురు చూస్తున్నారు.!