స్మార్ట్...వెరీ వెరీ స్మార్ట్...! ఎక్కడ చూసినా అందమైన పచ్చిక బైళ్లు...చెట్లు... పచ్చదనం..! ఎత్తైన భవనాలు, గతుకులు లేని విశాలమైన రోడ్లు...! పార్కింగ్ కూడా పక్కా ప్లాన్ ప్రకారమే..! జస్ట్.. ఓ స్మార్ట్ ఫోన్ తోనే అన్ని పనులు స్మార్ట్ గా జరిగిపోయేలా డిజిటల్ వ్యవస్థ...! ఇంకా చెప్పాలంటే అదో నవలోకం..మన కోసం వెలుస్తోంది..!
దేశంలోని నగరాలను...పట్టణాలను స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దే సరికొత్త కార్యక్రమానికి కేంద్రంలోని మోడీ సర్కార్ శ్రీకారం చుట్టింది..! అంతేకాదు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని నగరాలను కూడా ఈ పథకం కోసం ఎంపిక చేశారు..!
అందమే ఆనందం...! ఆనందమే జీవిత మకరందమన్నాడు ఓ సినీ కవి..! మన ఇల్లు...! మన చుట్టు ఉండే పరిసరాలు...! మన ఊరు...! మన నగరం కూడా అందంగా మారిపోతే ఎంత బాగుంటుంది..! ఈ అందమైన కలను నిజం చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ సంకల్పించారు..!
స్మార్ట్ నగరాలు...ప్రధాన మంత్రి నరేంద్రమోడీ స్వప్నం..! ఈ స్వప్నాన్ని సాకారం చేసేందుకు ఆయన నడుం కట్టారు. అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫార్మేషన్.... అమృత్, తోపాటు అందరికీ ఇళ్లు , స్మార్ట్ సిటీస్ మిషన్....పథకాలకు గురువారం అంకురార్పణ చేశారు.
‘స్మార్ట్ సిటీ’ అంటే కొత్తగా నగరాలను నిర్మించరు. ఉన్న నగరాలనే ‘స్మార్ట్’గా మారుస్తారు. నిర్దిష్ట అర్హతలున్న నగరాలనే స్మార్ట్ సిటీల కోసం ఎంపిక చేస్తారు. ఈ నగరాల్లో పర్యావరణ అనుకూల ఇంధన వినియోగానికి, నిర్మాణాలకు ప్రోత్సాహమిస్తారు. సమాచార, సాంకేతిక పరిజ్ఞానానికి పెద్దపీట వేస్తారు. పౌరులకు ‘జవాబుదారీ’గా ఉంటూ సేవలు అందిస్తారు. ప్రజలకు భద్రత, భరోసా ఉండేలా చర్యలు తీసుకుంటారు. స్మార్ట్ సిటీకి అయ్యే ఖర్చులో 40 శాతం కేంద్రం అందిస్తుంది. 50 శాతం రాష్ట్రాలు భరించాలి. మిగిలిన 10 శాతాన్ని పీపీపీ పద్ధతిలో సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.48 వేల కోట్లు.
ఈ అమృత్ కార్యక్రమంలో పలువురు కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మేయర్లు, ఛైర్పర్సన్లు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
దేశంలో ఎన్నడూ లేని రీతిలో భాగస్వామ్య పక్షాలతో విస్తృత చర్చలు జరిపి ఈ పథకాలను రూపొందించామని, కేంద్ర, రాష్ట్రాలు కలిసికట్టుగా వీటిని ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. పోటీ పడి నిర్దిష్ట ప్రమాణాలను సాధించిన నగరాలనే స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటి వరకు పట్టణీకరణకు సమగ్ర దృక్పథం కొరవడిందని, పట్టణాల విస్తరణను ఇప్పటి వరకు పాలకులు కాకుండా రియల్ ఎస్టేట్ డెవలపర్లు నిర్దేశించారని, కానీ, దానిని నిర్ణయించాల్సింది అక్కడి ప్రజలు, నాయకత్వమేనని చెప్పారు.
అంతేకాదు స్మార్ట్ కు పీఎం మోడీ తనదైన నిర్వచనం ఇచ్చారు. దేశ ప్రజల ఆకాంక్షలకు ఎప్పుడు రెండడుగుల ముందుండటమే స్మార్ట్ అని ఆయన అభివర్ణించారు. టెక్నాలజీ, రవాణ సౌకర్యాలు, విద్యుత్ , కార్మికుల పని విధానంలో స్మార్ట్ పద్ధతుల్ని తీసుకురావాల్సి ఉందనేది ప్రధాని అభిప్రాయం. ప్రస్తుతం దేశంశోల చాలా మంది ఉద్యోగులు తమ ఆఫీసులకు వెళ్లేందుకు ఎక్కువ సమయం ప్రయాణిస్తున్నారని...ఆఫీసుల్లో తక్కువ సమయం గడుపుతున్నారని....ప్రతి ఒక్కరు నడిచి ఆఫీసుకు వెళ్లేలా రవాణా సౌకర్యాల ఏర్పాటుతోపాటు టెక్నాలజీకి పెద్దపీట వేయాలని పీఎం సూచించారు.
అటు పట్టణాల్లో చెత్త నుంచి కంపోస్టు ఎరువు తయారు చేసి గ్రామాల్లో ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలు పండించేలా చర్యలు చేపడతామని ప్రధాని అన్నారు. నిధుల కొరత లేకుండా కేంద్ర, రాష్ట్రాలు నమూనా తయారు చేయాలని, పీపీపీ పద్ధతిలో, ఎఫ్‌డీఐల రూపంలో నిధులు సమకూరుతాయని వివరించారు. ఈ సందర్భంగా కర్ణాటకలో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, ఛత్తీస్ గఢ్ బహిర్భూమి నిర్మూలనకు అమలు చేస్తున్న విధానాలను కొనియాడారు. ఆస్తి పన్ను వసూలు విషయంలో జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ ఇచ్చిన ప్రజెంటేషన్ ను పీఎం మెచ్చుకున్నారు. మిగతా నగరాలు కూడా చిత్తశుద్ధితో ప్రజామోదిత పథకాలతో ఈ తరహా లక్ష్యాలను అధిగమించవచ్చునని ఆయన అన్నారు.
తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ నుంచి మొత్తం ఐదు నగరాలను ఈ పథకాల అమలు కోసం ఎంపిక చేశారు. తెలంగాణలో హైదరాబాద్ , వరంగల్ నగరాలు ఉండగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ, విశాఖపట్నం తిరుపతి నగరాలు ఎంపిక అయ్యాయి.