న్యూయార్క్: అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది. ప్రధాని మోదీకి బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్
‘గ్లోబల్ గోల్ కీపర్ అవార్డు’ ఇచ్చి సత్కరించింది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న 'స్వచ్ఛ భారత్ అభియాన్' పథకానికి గానూ ఈ రోజు ఉదయం బిల్‌గేట్స్ చేతుల మీదుగా ప్రధాని ఈ అవార్డును అందుకున్నారు. 2014లో తొలిసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం అన్ని రాష్ట్రాల్లోని రైల్వే స్టేషన్లు, బస్టాండులలో, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో అమల్లో ఉంది.
‘గ్లోబల్ గోల్ కీపర్ అవార్డు’ అందుకున్న అనంతరం ప్రధాని మాట్లాడుతూ... ఈ అవార్డును భారత ప్రజలకు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. మహాత్మా గాంధీ 150 జయంతి జరగనున్న సంవత్సరంలో ఈ అవార్డును అందుకోవడం వ్యక్తిగతంగా తనకు దక్కిన ప్రత్యేక గుర్తింపుగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. దేశంలో గాంధీజీ ఆశయాలను తూచ తప్పకుండా అమలు చేస్తున్నామన్నారు. స్వచ్ఛభారత్‌ను ఉద్యమంలా మరింత ముందుకు తీసుకెళ్తున్నామనీ ప్రధాని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో 11 కోట్ల మరుగుదొడ్లను నిర్మించామని, రాయబోయే కాలంలో మరిన్ని మరుగుదొడ్లు నిర్మించి స్వచ్ఛభారత్ కు పాటుపడతామని పేర్కొన్నారు. 130 కోట్ల మంది భారత ప్రజలు ప్రతిజ్ఞ చేస్తే ఎలాంటి సవాలునైనా ఎదుర్కోగలం అని వ్యాఖ్యానించారు.