కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఎన్నికల ర్యాలీలో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా...
అధ్యక్షుడు ఘనీ పేలుడు నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఎన్నికల సందర్భంగా ఈ రోజు పర్వాన్ ప్రావిన్స్ రాజధాని చరికర్‌లో ఏర్పాటు చేసిన ఓ ర్యాలీలో పాల్గొన్న ఘనీ మాట్లాడుతుండగా భారీ పేలుడు సంభవించింది. మృతి చెందిన వారిలో పలువురు చిన్నారులు, మహిళలు ఉన్నారు. గాయపడ్డ వారిని ప్రావిన్షియల్ ఆసుపత్రికి తరలించారు. కాగా... మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆసుపత్రి హెడ్ అబ్దుల్ ఖాసిమ్ సింగిన్ తెలిపారు.
బాంబు పేలుడుపై స్పందించిన ఆఫ్ఘన్ ప్రభుత్వాధికారి మాట్లాడుతూ... ర్యాలీలోకి చొరబడిన ఓ ఆత్మాహుతి సభ్యుడు తనను తాను పేల్చేసుకుని దాడికి పాల్పడినట్టు తెలిపారు. అయితే... ఇప్పటివరకు ఈ బాంబు పేలుడుకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించలేదు. మరోవైపు ఈ నెల 28న ఆఫ్ఘనిస్థాన్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.