న్యూయార్క్: జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్ ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితిలో భారత రాయబారి
సయ్యద్ అక్బరుద్దీన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. "చిన్న, పెద్ద, అన్ని దేశాలు ఒక్క చోట చేరాయి. ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన జాబితాలో మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది." అని ట్వీట్ చేశారు. దీంతో భారత్ ఉగ్రవాదంపై భారీ విజయం సాధించినట్లైంది.
పఠాన్‌కోట్, యూరీ, పుల్వామా దాడుల ప్రధాన సూత్రధారైన మసూద్ పాకిస్థాన్ లో తలదాచుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఐక్యరాజ్యసమితి అతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేర్కొనడంతో ప్రపంచ దేశాల ముందు పాక్ పరువుపోయినట్లయింది. అయితే గత కొంత కాలంగా ఐక్యరాజ్యసమితి మసూద్ అజర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టకుండా చైనా సాంకేతిక కారణాలు చూపుతూ... పలుమార్లు మోకాల్లడ్డిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఈ విషయంలో చివరికి భారత్ దే పైచేయిగా నిలిచింది. ప్రపంచ దేశాలు ఉగ్రవాదంపై ఒక్కతాటిపైకి రావడంతో చైనా కూడా దారిలోకి రాక తప్పలేదు. ఇక మసూద్ విషయంలో చైనా పెట్టిన తన అభ్యంతరాలను వెనక్కి తీసుకోవడంతో... అతన్ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.