మసూద్ అంశంపై చైనా సానుకూలంగా స్పందించింది. యూఎన్ సమావేశానికి ఒకరోజు ముందు
జైషే మహ్మద్ అధినేత మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే విషయంలో చైనా నుంచి సానుకూల స్పందన వ్యక్తమైంది. దీన్ని సరైన రీతిలో పరిష్కరించాలని బీజింగ్ సూచించింది. అయితే ఎప్పటిలోగా దీన్ని పరిష్కరించాలన్న విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ సమావేశమైన మరుసటి రోజునే బీజింగ్ నుంచి ఈ సానుకూల స్పందన రావడం గమనార్హం.
పుల్వామా ఉగ్రదాడికి తమ సంస్థే కారణమంటూ జైషే ప్రకటించుకోవడంతో మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ మార్చిలో యూఎన్‌లో మరోసారి ప్రతిపాదన పెట్టగా..సాంకేతిక కారణాలతో చైనా దాన్ని తోసిపుచ్చింది. అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా అడ్డుకోవడం ఇది నాలుగోసారి. ‘ఈ సమస్య సరైన రీతిలోనే పరిష్కరించగలమనే నమ్మకం ఉంది’ అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జెంగ్ షుకాంగ్ మీడియాకు వెల్లడించారు. ఉగ్రవాదులను కట్టడి చేసే 1267 ఆంక్షల కమిటీ తీర్మానంపై తాను విధించిన సాంకేతిక నిలుపుదలను తొలగించేందుకు చైనా సన్నాహాలు చేస్తోందంటూ మీడియాలో వచ్చిన వార్తల నేపథ్యంలో జెంగ్ పైవిధంగా స్పందించారు. యూఎస్, యూకే, ఫ్రాన్స్ దేశాలు నేరుగా ఈ అంశాన్ని యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ వద్దకు తీసుకెళ్లి బీజింగ్ మీద ఒత్తిడి పెంచుతున్నాయి.