శ్రీలంక : ఎందరో ప్రాణాలను పొట్టనబెట్టుకున్న తన సోదరుడు బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయినందుకు తనకు చాలా సంతోషంగా ఉందంటోంది
శ్రీలంకకు చెందిన మధానియా. ఈ నెల 21వ తేదీ ఈస్టర్ సందర్భంగా శ్రీలంక రాజధాని కొలంబోలోని పలు చర్చిల్లో, హోటళ్లలో ఐసిస్ కు చెందిన ఉగ్రమూక మారణహోమాన్ని సృష్టించి వందలాది మంది ప్రాణాలను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ పేలుళ్లలో షాంఘ్రిలా అనే హోటల్ లో మధానియా సోదరుడు జహ్రాన్ తనని తానే పేల్చివేసుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. అయితే ఈ ఘటనలో చనిపోయింది జహ్రానేనా ? కాదా ? అన్న విషయాన్ని నిర్థారించుకునేందుకు అక్కడి మిలిటరీ ఇంటెలిజెన్స్ శ్రీలంకలోని కాల్మునాయ్ అనే మారమూల ప్రాంతంలో నివసిస్తున్న సోదరి మధానియా ఇంటికెళ్లి... జహ్రాన్ మృతదేహం అంపారా ప్రాంతంలోని ఓ ఆస్పత్రిలో ఉంది. మీరు వచ్చి అతడు మీ సోదరుడో కాదో చూసుకోండి అని చెప్పగా మధానియా స్పందించిన తీరు వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. ''మీరు కేవలం చనిపోయిన ఉగ్రవాదుల ఫొటోలు మాత్రమే చూపించండి. నేను వారి మృతదేహాలను చూడాలనుకోవడంలేదు. నేను జహ్రాన్‌తో 2017లోనే తెగదెంపులు చేసుకున్నాను. తన ప్రసంగాలతో విషాన్ని చిమ్మేవాడు. ఇస్లాం పేరుతో తప్పుడు మార్గం ఎంచుకున్నాడు. ఇతర మతాలను తప్పుబట్టాడు. జహ్రాన్ ఆరో తరగతిలోనే చదువు మానేశాడు. ఇస్లామిక్ చదువులపై దృష్టిసారించేవాడు. 2006లో ఇస్లామిక్ స్టడీస్ కేంద్రాన్ని ప్రారంభించాడు. అతను ఖురాన్ చదివి మంచి మార్గంలో నడుస్తాడనుకుంటే.. ప్రజలను చంపడం మొదలుపెట్టాడు. ఇప్పుడు వాడు చచ్చినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. 2017 మార్చిలో తన అనుచరులతో కలిసి సూఫీ ముస్లింలకు వ్యతిరేకంగా ప్రసంగాలు చేసి వివాదంలో చిక్కుకున్నాడు. దాంతో పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారోనని తప్పించుకు తిరిగాడు. మొత్తానికి పేలుడులో చనిపోయినందుకు నేనెంతో ఆనందిస్తున్నాను'' అని మధానియా పేర్కొన్నారు.