పవిత్రమైన రోజైన ఈస్టర్ పర్వదినం నాడు శ్రీలంక రాజధాని కొలంబోలో వరుసగా మూడు చర్చిలలో, మూడు హోటళ్లలో
జరిగిన 8 బాంబ్ బ్లాస్ట్ల్ లతో అక్కడి ప్రజలు వణికిపోయారు. ఉగ్రమూక సృష్టించిన ఈ మారణకాండలో ఇప్పటి వరకూ అధికారికంగా 321 మంది మృతి చెందగా...500 మందికి పైగా గాయాల పాలై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో విదేశీయులు, భారతీయులు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. జరిగిన ఘోరం కళ్లముందు మెదలాడుతుండగానే...కొలంబోలో ఐసిస్ మళ్లీ భారీ పేలుళ్లకు కుట్ర పన్నిందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఆదివారం జరిగిన దానికన్నా రెట్టింపు దాడులు చేసేందుకు ఉగ్రమూక సిద్ధమవుతోందని, ఈసారి బహిరంగ ప్రదేశాలు లక్ష్యంగా పేలుళ్లు జరిపేందుకు వ్యూహం రచిస్తోందని ఇంటెలిజెన్స్ తెలిపింది. ఇప్పటికే వ్యాన్లు, కార్లలో భారీమొత్తంలో పేలుడు పదార్థాలను తరలించినట్లు సమాచారం అందింది. సైకిళ్లలో సైతం బాంబులు అమర్చి పేలుళ్లు జరిపేందుకు ఉగ్రవాదులు సిద్ధమయ్యారని, ఏ క్షణంలోనైనా పేలుళ్లు జరిగే అవకాశం ఉంది...అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ శ్రీలంక ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో శ్రీలంకలో హై అలర్ట్ కొనసాగుతోంది. ప్రజలెవరూ బయటికి రాకుండా విధించిన కర్ఫ్యూను పొడింగించింది. భద్రతను పెంచి, ప్రతి వాహనంలోనూ తనిఖీలు చేపట్టింది పోలీస్ శాఖ. అలాగే బ్యాగులు పట్టుకుని ఎవరూ రోడ్లపై తిరగొద్దని ప్రభుత్వం ఆదేశించింది.
ఈస్టర్ రోజు జరిగిన పేలుళ్ల పై కూడా ఇంటెలిజెన్స్ ఏప్రిల్ 11వ తేదీనే శ్రీలంకను హెచ్చరించినా...దానిని పట్టించుకోకపోవడంతోనే ఇంత దారుణం జరిగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో మరోసారి పేలుళ్లు జరుగుతాయని ఇంటెలిజెన్స్ చేసిన హెచ్చరికలను శ్రీలంక పరిగణలోకి తీసుకుని భద్రతను కట్టుదిట్టం చేసింది.