శ్రీలంక రాజధాని కొలంబోలో ఈస్టర్ పర్వదినం రోజున ఉగ్రవాదుల మారణకాండ సృష్టించి 321 మందిని పొట్టనపెట్టుకున్నది తామేనని
ప్రకటించింది ఇస్లామిక్ స్టేట్స్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్). స్థానిక అమాక్ న్యూస్ ఏజెన్సీతో ఐసిస్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఆదివారం జరిగిన ఈ పేలుళ్లపై శ్రీలంక విదేశాంగ శాఖ మంత్రి ఇది ఖచ్చితంగా ఐసిస్ పనేనని అనుమానం చేయగా...ఇప్పుడు అదే నిజమని వెల్లడైంది. న్యూజిలాండ్ మసీదులో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ పేలుళ్లకు పాల్పడినట్లు ఐసిస్ చెప్పింది. కాగా..పేలుళ్లు జరిగిన రోజు ఈ పేలుళ్లకు కారణం...‘ది నేషనల్ తవ్హీద్ జమౌత్’, ‘జమ్మియాతుల్ మిల్లతు ఇబ్రహీం’ అనే ఉగ్రవాద సంస్థలని రువాన్ విజేవార్దెనే అనే రాజకీయవేత్త తెలిపారు. ఇదిలా ఉంటే ఐసిస్ ఎక్కడ ఉగ్రదాడి చేసినా...అది జరిగిన వెంటనే ఆ దాడి తమపనేనని చెప్పుకునేది. కానీ శ్రీలంక పేలుళ్లపై మాత్రం ఐసిస్ రెండ్రోజులు ఆలస్యంగా స్పందించడం పలు అనుమానాలకు దారితీస్తోంది.