భారతదేశ ఉపఖండమైన శ్రీలంకలో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఈస్టర్ పండుగ జరుపుకుంటున్న సమయంలో
ఆదివారం చర్చిలు, హోటళ్లు లక్ష్యంగా ఉగ్ర మూక 8 బాంబు దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ఇప్పటి వరకూ 290 మంది మృత్యువాత పడగా..500 మందికి పైగా తీవ్రగాయాలపాలయ్యారు. కొలంబోలో వరుస బాంబ్ బ్లాస్ట్ లతో అధికారుల అప్రమత్తయ్యారు. కొలంబో బస్టాండ్ లో చేపట్టిన తనిఖీల్లో ఏకంగా 87 బాంబ్ డిటోనేటర్లను గుర్తించారు. దీంతో శ్రీలంక వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఆదివారం విధించిన కర్ఫ్యూ ఇంకా కొనసాగుతోంది. డిటోనేటర్లతో పాటు ఇంకా ఎక్కడెక్కడ బాంబులున్నాయో గుర్తించి, వాటిని నిర్వీర్యం చేసేందుకు అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ అర్థరాత్రి నుంచి ఆ దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారు. వరుస పేలుళ్లలో నేషనల్ తౌఫిక్ జమాత్ హస్తముందేమోనని శ్రీలంక అనుమానం వ్యక్తం చేస్తోంది.
ఇదిలా ఉండగా కొద్దిసేపటి క్రితమే కొలంబోలోని ఆంథోనియా చర్చి సమీపంలో మరో బాంబు పేలింది. ఈ పేలుడులో ఎంత మంది మృతి చెందారో..ఎంతమంది గాయపడ్డారో తెలియాల్సి ఉంది.