శ్రీలంక రాజధాని కొలంబోలో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. మొత్తం 8 బాంబ్ బ్లాస్ట్ లలో
మూడు ఆత్మాహుతి దాడులుగా గుర్తించారు అధికారులు. ఈస్టర్ వేడుకల సందర్భంగా చర్చిలను టార్గెట్ చేసిన ఐసిస్ పక్కా ప్లాన్ ప్రకారమే పేలుళ్లు జరిపినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు నిర్థారించాయి. ఏప్రిల్ 11వ తేదీనే ఈ దాడుల గురించి శ్రీలంకను హెచ్చరించినా కనీస జాగ్రత్త చర్యలు పాటించకుండా నిర్లక్ష్యం చేసిందంటున్నారు. ఫలితంగా ఇప్పటి వరకూ 207 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా...500 మందికి పైగా క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఉదయం సమయంలో వరుసగా మూడు చర్చిలు, మూడు హోటళ్లలో పేలుళ్లు జరిపిన ఉగ్రవాదులు మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఒకసారి, సాయంత్రం మరోసారి పేలుళ్లకు పాల్పడ్డారు. ఇంకా ఎక్కడెక్కడ బాంబు పేలుళ్లు జరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే డాగ్ స్క్వాడ్, బాంబా స్క్వాడ్ ముమ్మర తనిఖీలు చేపట్టింది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు తదితర ప్రాంతాల్లో ప్రయాణాలను నిలిపివేశారు. ఇంటర్ నెట్ సేవలను ఆపివేశారు. వరుస పేలుళ్లను చూసి శ్రీలంక వాసులంతా భయబ్రాంతులకు గురయ్యారు. కొలంబోతో పాటు అన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించింది అక్కడి ప్రభుత్వం. స్థానిక విద్యాసంస్థలకు రెండ్రోజులు సెలవులు ప్రకటించింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు శ్రీలంక ప్రభుత్వం తెలిపింది.