ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో సుమారు 400 హిందూ దేవాలయాల పునరుద్ధరణకు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశ విభజన సమయంలో లక్షలాది హిందువులు
వారి ఆస్తులు విడిచి పాకిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చేశారు. అనంతరం వారి భూములు, ఆస్తులు అక్కడి స్థానికుల వశమయ్యాయి. పాక్ లోని ఆలయాలను పట్టించుకునే వారు లేకపోవడంతో కొన్ని ఆలయాలు మదర్సాలుగా మారిపోయాయి. అయితే ఎన్నో ఏళ్లుగా హిందూ దేవాలయాలను పునరుద్ధరించాలంటూ అక్కడి హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో వాటికి ఇప్పటికి మోక్షం కలగనుంది. ఇమ్రాన్ ప్రభుత్వం ఇప్పుడు వాటిని తిరిగి పునరుద్ధరించే పనిలో పడింది. హిందూ ముస్లీముల మధ్య శాంతి, సామరస్యతలు పెంపొందించే దిశగా పునరుద్ధరణ చర్యలు చేపట్టామని పాక్ ప్రభుత్వం పేర్కొంది.
ఆల్ పాకిస్థాన్ హిందూ రైట్స్ మూవ్‌మెంట్స్ తెలిపిన లెక్కల ప్రకారం పాకిస్థాన్‌లో మొత్తం 429 దేవాలయాలు ఉన్నాయి. వీటిలో 400 పైగా ఆలయాలు రెస్టారెంట్లుగా, స్కూళ్లుగా, ప్రభుత్వ ఆఫీసులుగా, మరి కొన్ని బొమ్మల షాపులుగా మారిపోయాయి. అయితే వాటిలో సింధ్‌లో 11, పంజాబ్‌లో 4, బెలూచిస్థాన్‌లో 3, ఖైబర్ ఫంక్తున్ఖ్వాలో 2 ఆలయాలను తిరిగి నిర్మించాలని పాక్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో ఉన్న సుప్రసిద్ధ శారదా పీఠం దర్శన భాగ్యం పాక్‌లోని హిందువులకు దక్కనుంది.