జైషే మహ్మద్ చీఫ్ మజూద్ అజార్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడంలో చైనా తీరుతో విసిగిపోయిన అగ్రరాజ్యం అమెరికా సహా ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు అల్టిమేటం జారీ చేశాయి. ఏప్రిల్ 23వ తేదీలోపు
ఈ విషయంలో చైనా అభ్యంతరాలేమిటో తెలపాలని తాత్కాలిక గడువు విధించాయి. లేనిపక్షంలో తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశాయి. ఐరాస భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ)లో తీర్మానాన్ని అధికారికంగా ప్రవేశపెట్టి, సభ్యదేశాల అభిప్రాయాలను కోరి అనంతరం ఓటింగ్ నిర్వహించాలని అమెరికా నిర్ణయించుకున్నట్లు ఓ ప్రముఖ ఆంగ్ల మీడియా పేర్కొంది. ఆంక్షల కమిటీలోని కొన్ని నిబంధనలను అడ్డం పెట్టుకుని కారణాలను తెలపడానికి నిరాకరిస్తున్న చైనాను ఈసారి ఎలాగైనా మండలిలో దోషిగా చూపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ అమెరికా మాత్రం ఈ విషయంపై స్పందించేందుకు నిరాకరించింది. ఫ్రాన్స్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లుగా అమెరికా పేర్కొంది.
ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామాలో ఇండియన్ ఆర్మీపై జరిగిన ఉగ్రదాడి తర్వాత మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సంయుక్తంగా యూఎన్ఎస్సీలో ప్రతిపాదించాయన్న సంగతి తెలిసందే. కానీ సాంకేతిక కారణాలు అడ్డొస్తున్నాయంటూ చైనా ఈ ప్రతిపాదనకు మోకాలడ్డింది. ప్రతిపాదనను పరిశీలించడానికి తమకు సమయం కావాలని కోరింది. నిబంధనల ప్రకారం మరో ఆరు నెలల వరకు దీన్ని యూఎన్‌ఎస్‌సీలో ప్రవేశపెట్టడం సాధ్యం కాదు. తరవాత మరే సభ్యదేశమైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే మరో మూడునెలల వరకు పొడిగిస్తారు. ఈ నేపథ్యంలో మసూద్ విషయంలో అనుకూల వైఖరి ప్రదర్శిస్తున్న చైనా కుయుక్తులను పసిగట్టిన అమెరికా ప్రత్యామ్నాయ మార్గంలో అతన్ని నిషేధిత జాబితాలో చేర్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా బ్రిటన్, ప్రాన్స్‌తో కలిసి సరికొత్త తీర్మానాన్ని రూపొందించింది. దానిని మండలిలోని సభ్య దేశాలకు పంపడంతో మార్చిలోనే మండలిలో చర్చలు మొదలయ్యాయి. మసూద్ విషయంలో చైనా తీరుపై సభ్య దేశాలు మండిపడుతూ...ఏదో ఒక నిర్ణయానికి రావాలని ఒత్తిడి పెంచాయి. అయితే కార్యాచరణ ప్రకారం ఏప్రిల్ 23 తర్వాత మండలిలో చర్చ చేపడుతారు. ఆ తర్వాత ఓటింగ్ పద్ధతిలో మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.