ఇస్లామాబాద్: ఈనెల భారత్ లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే బాగుంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్.
మోడీ మల్లి ప్రధాని అయితేనే భారత్-పాక్ మధ్య శాంతి చర్చలు జరిపేందుకు మెరుగైన అవకాశాలు ఉంటాయని అన్నారు. అలాకాకుండా ప్రతిపక్ష కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కశ్మీర్ సమస్యపై ఒక్క నిర్ణయానికి రావడం కష్టతరమవుతుందని అభిప్రాయబడ్డారు. బీజేపీ అయితే హిందుత్వ పార్టీగా ఎక్కువ పేరుంది కాబట్టి మోడీ అధికారంలోకి వస్తే కశ్మీర్‌కు సంబంధించిన కొన్ని విషయాల్లో తొందరగా ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు. ఇప్పుడు భారత్‌లో హిందూ మతత్వ వాదనలు ఎక్కువయ్యాయని ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని.. ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయని తాను ఎన్నడూ ఊహించలేదన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ మాదిరిగానే మోడీ కూడా ‘భయం, జాతీయత’ వంటి అంశాల్ని ప్రచారాస్త్రాలుగా ఉపయోగించుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అలాగే కశ్మీర్‌లో ఎన్నో దశాబ్దాలుగా అమల్లో ఉన్న ఆ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ ను బీజేపీ రద్దు చేస్తాననడంపై కశ్మీర్‌లో ఆందోళన పరిస్థితులను రెచ్చగొడుతోందని అన్నారు.