ఒకే కాన్పులో ఇద్దరు, ముగ్గురు, ఒకేసారి ఏడుగురు పుట్టిన సంఘటనలు ఉన్నాయి. కానీ నెలరోజుల వ్యవధిలో ఓ మహిళ
రెండుసార్లు ప్రసవించి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన సంఘటన బహుశా ఇంత వరకూ ఎక్కడా జరగలేదేమో. బంగ్లాదేశ్ లోని జెస్సోర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ అలా ప్రసవించే ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే..ఇది చదవండి..
బంగ్లాదేశ్‌లోని జెస్సోర్ ప్రాంతానికి చెందిన అరిఫా సుల్తానా ఐతీకి ఫిబ్రవరి 25న ఉన్నట్లుండి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ సాధారణ ప్రసవంతోనే నెలలు నిండని ఓ మగబిడ్డకు ఆమె జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉండటంతో వైద్యులు వారిని ఇంటికి పంపారు. అయితే మార్చి 22వ తేదీన అరిఫాకు మరోసారి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు కంగారు పడి మళ్లీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ అరిఫాను పరిశీలించిన వైద్యులు ఆమె కడుపులో మరో ఇద్దరు శిశువులున్నట్లు గుర్తించారు. వెంటనే సిజేరియన్ చేసి ఇద్దరు శిశువులకు ప్రాణం పోశారు వైద్యులు. కేవలం 26 రోజుల వ్యవధిలో అరిఫా ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది.
అయితే మొదటిసారి ప్రసవించినపుడు వైద్యులు ఆమెకు రెండు గర్భాశయాలున్నట్లు గుర్తించకపోవడంతోనే ఇలా జరిగినట్లు తెలుస్తోంది. ‘మహిళకు రెండు గర్భాశయాలు ఉండటం అత్యంత అరుదు. అరిఫాకు మొదట ఒక గర్భాశయం ద్వారా మగబిడ్డ జన్మించాడు. రెండోసారి మరో గర్భాశయం ద్వారా కవలలు పుట్టారు. బహుశా ఇలా జరగడం ఇదే తొలిసారి అయి ఉంటుంది’ అని అరిఫాకు శస్త్రచికిత్స చేసిన వైద్యురాలు షీలా తెలిపారు. ప్రస్తుతం తల్లి, ముగ్గురు పిల్లలు క్షేమంగా ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. జెస్సోర్ చీఫ్ గవర్నమెంట్ డాక్టర్ దిలీప్ రాయ్ స్పందిస్తూ..‘నా 30ఏళ్ల కెరీర్‌లో ఇలాంటి కేసును నేను చూడలేదు. తొలి ప్రసవం జరిగిన ఆసుపత్రిలోని వైద్యులు రెండో గర్భాన్ని ఎందుకు గుర్తించలేదో తెలియడం లేదు’ అని చెప్పుకొచ్చారు.