ప్లాస్టిక్ వాడకం మనుషుల ప్రాణాలకే కాదు...ఇప్పుడు సముద్రపు జీవుల ప్రాణాలమీదికి తీసుకొస్తుంది. ప్రపంచంలోనే సముద్రాన్ని ఎక్కువగా
పొల్యూట్ చేస్తున్న దేశంలో ఫిలిప్పిన్స్ మొదటి స్థానంలో ఉంది. ఆ దేశస్తులు ప్లాస్టిక్ ను రీ సైకిల్ చేయకపోవడం వల్ల అదంతా సముద్రంలోకి చేరి అందులో ఉన్న జీవుల ప్రాణాలను హరిస్తోంది. తాజాగా ఈ ప్లాస్టిక్ కారణంగానే ఓ భారీ తిమింగలం ప్రాణాలు కోల్పోయింది. రెండ్రోజుల క్రితం ఫిలిప్పీన్స్ లోని మబీని నగరం ఒడ్డున అచేతన స్థితిలో పడి ఉన్న తిమింగలాన్ని జాలర్లు గమనించి..దానిని తిరిగి సముద్రంలోకి పంపించారు. అయినప్పటికీ దానికి ఈదుకుంటూ వెళ్లే శక్తి లేక కొద్దిసేపటికే మరణించింది. ఆస్పత్రిలో తిమింగలాన్ని పరీక్షించిన వైద్యులు దాని మరణానికి గల కారణం తెలిసి నిర్ఘాంతపోయారు. ఆకలిని తట్టుకోలేక తిమింగలం చనిపోయిందని విన్నవారు ఆశ్చర్యపోయారు. అది తినేందుకు వీలులేకుండా లోపల ఏకంగా 40 కేజీల ప్లాస్టిక్ అడ్డుగా ఉండిపోయిందని వైద్యులు వెల్లడించారు. ఈ కారణం తెలుసుకున్న ప్రతిఒక్కరూ ఆవేదన చెందారు. ఒక సముద్రపు జీవి ఇంత దారుణంగా మృతి చెందడం బహుశా ఇదే మొదటి సారి కావచ్చన్నారు. కాగా..గతేడాది థాయ్ ల్యాండ్ లో 80 ప్లాస్టిక్ బ్యాగులు మింగి ఓ తిమింగలం మరణించింది.