జర్మన్ టెన్నిస్ దిగ్గజం స్టెఫీగ్రాఫ్ కేరళ ఆయుర్వేద వైద్యానికి ప్రచారకర్తగా నియమితురాలైంది.
రెండు దశాబ్దాల పాటు టెన్నిస్ ప్రపంచాన్ని ఏలిన 46 ఏండ్ల స్టెఫీగ్రాఫ్‌ను ఆయుర్వేద బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించేందుకు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊమెన్‌చాందీ తెలిపారు. దీంతోపాటు, ప్రత్యేకంగా రూపొందించిన విజిట్ కేరళ స్కీమ్ పథకంలో భాగంగా స్టెఫీగ్రాఫ్‌తో ఒప్పందం కుదర్చుకునేందుకు పర్యాటక శాఖకు అనుమతినిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని సీఎం వెల్లడించారు. ఇప్పటికే టూరిజం శాఖ ఆమెతో సంప్రదింపులు జరిపి ఒప్పందం చేసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. కెరీర్‌లో ఏకంగా 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్లను తన ఖాతాలో వేసుకున్న స్టెఫీగ్రాఫ్ 1999లో టెన్నిస్‌కు వీడ్కోలు పలికింది. చాలా కాలం నంబర్‌వన్ హోదాలో కొనసాగిన ఈ జర్మన్ టెన్నిస్ క్వీన్ 2001లో అమెరికా మాజీ టెన్నిస్ స్టార్ అండ్రీ అగస్సీని పెండ్లి చేసుకుంది.