కోల్‌కతా: భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికయ్యారు. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన 88వ వార్షిక సర్వసభ్య సమావేశం
సందర్భంగా గంగూలీ వరుసగా రెండోసారి క్యాబ్ పదవీ బాధ్యతలు చేపట్టాడు. మూడేళ్ల పాటు దాదా ఈ పదవిలో కొనసాగనున్నాడు. ఇక వైస్ ప్రెసిడెంట్‌గా నరేశ్ ఓజా, సెక్రటరీగా అవిషేక్ దాల్మియా గంగూలీ ప్యానెల్ నుంచి ఎంపికయ్యారు.
గంగూలీ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ప్యానెల్ కబ్ అధ్యక్షా ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఎలాంటి పోటీలేకుండానే 11 మంది కౌన్సిలర్స్ కూడా అపెక్స్ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. 2015లో అప్పటి క్యాబ్ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా అకస్మాత్తుగా మరణించడంతో దాదా తొలిసారి క్యాబ్ చీఫ్‌గా ఎన్నికయ్యాడు. గంగూలీ తొలిసారిగా క్యాబ్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా చేరి అనంతరం 2014లో జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యాడు.