ఢిల్లీ: దేశ రాజధానిలోని చారిత్రాత్మక ఫిరోజ్ షా కోట్ల క్రికెట్ స్టేడియం పేరును అరుణ్ జైట్లీ స్టేడియంగా మారుస్తూ... ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) పాలకవర్గం ఈ రోజు కీలక నిర్ణయం
తీసుకుంది. ఈ విషయాన్ని డీడీసీఏ ట్విటర్లో పేర్కొంది. 1999 నుంచి 2013 వరకు జైట్లీ డీడీసీఏ అధ్యక్షుడిగా కొనసాగారు. దీంతో మాజీ అధ్యక్షుడు జైట్లీకి ఇదే సరైన నివాళిగా భావిస్తున్నట్లు డీడీసీఏ పాలకవర్గం తెలిపింది. గత శనివారం ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ కేంద్ర మాజీ మంత్రి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. కాగా... ఆయన ఢిల్లీ క్రికెట్ జట్టుకు చేసిన సేవలకు స్మారకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీడీసీఏ పేర్కొంది.
ఈ సందర్భంగా డీడీసీఏ అధ్యక్షుడు రజత్ శర్మ మాట్లాడుతూ... అరుణ్‌జైట్లీ ప్రోత్సాహం, సహకారం వల్లనే విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, ఆశిష్ నెహ్రా, రిషబ్ పంత్ లాంటి ఆటగాళ్లతో పాటు ఎంతో మంది క్రీడాకారులు దేశానికి ప్రాతినిధ్యం వహించి భారత్ గర్వపడేలా చేశారని అన్నారు.