హర్యాన: బ్రిటీషర్ల తరహాలో బీజేపీ దేశాన్ని విడతీయాలని చూస్తోందని విమర్శించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. హర్యాన ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు
ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ... ప్రధాని మోదీ మన్‌కీ బాత్ గురించి మాట్లాడుతుంటారని, నేను మాత్రం కామ్ కీ బాత్ గురించి చెబుతానన్నారు. భారత్ వివిధ మతాల, కులాలవారున్న భిన్నత్వ దేశమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలందరికి చెందుతుంది, కానీ బీజేపీ మాత్రం బ్రిటీషర్ల తరహాలో దేశాన్ని విభజిస్తోందని విమర్శించారు. మేం తప్పుడు వాగ్దానాలు చేయమని, వాగ్ధానం చేసిన వాటిని మాత్రం నెరవేస్తామని రాహుల్ చెప్పుకొచ్చారు. వాళ్లకు వాళ్లే దేశభక్తులు అని చెప్పుకుంటున్నారు, ఒకవేళ వాళ్ళు దేశభక్తులే అయితే, మరెందుకు దేశ సొత్తును అమ్ముతున్నారని ఆరోపించారు. నిజమైన సమస్యల నుంచి తప్పుదోవ పట్టించేందుకు మోదీ ఇలాంటి జిత్తులు వేస్తున్నారని రాహుల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.