చెన్నై: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ రేపు భారత పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన రాక కోసం చెన్నై ఎయిర్‌పోర్టు అధికారులు, సిబ్బంది ఆకుపచ్చని తోరణాలతో
ఆయనకు స్వాగత ఏర్పాట్లు చేశారు. ఈ పర్యటనలో భాగంగా జీ జిన్‌పింగ్... ఈ నెల 11-12 తేదీల్లో రెండు రోజుల పాటు భారత్ లో పర్యటించనున్నారు. మొదట జిన్‌పింగ్ ఈ నెల 11న చెన్నై సమీపంలోని మహాబలిపురానికి వెళ్తారు. 12న కూడా అక్కడే ఉండి ఏడో-ఎనిమిదో శతాబ్దికి చెందిన ప్రాచీన ఆలయాలు, బౌద్ధాకృతులను సందర్శిస్తారు. అలాగే... ఈ పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. కాగా... ఇది వారిరువురికి అనధికార సమావేశమేనని తెలుస్తోంది.
జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేసిన అనంతరం పాకిస్తాన్ భారత్‌కు వ్యతిరేకంగా చైనా నాయకులతో సమావేశమై తన గోడు వెల్లగక్కుతోంది. మరోవైపు ప్రస్తుతం పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ చైనా పర్యటనలోనే ఉన్నారు. ఆయన చైనా ప్రధానితో భేటీ అయి కశ్మీర్ అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి సమయంలో చైనా అధ్యక్షుడు భారత పర్యటనకు రావడం ఇరు దేశాల్లో చర్చనీయాంశమైంది.