ముంబై: ఈ నెల చివరన జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను అధికార బీజేపీ ప్రకటించింది. మొత్తం 125 మందితో కూడిన
తొలి జాబితాను ఈ రోజు ప్రకటించింది. ఆ జాబితాలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ నాగపూర్ నైరుతి నుంచి, బీజేపీ మహారాష్ట్ర చీఫ్ చంద్రకాత్ పాటిల్ కొత్రుడ్ నుంచి పోటీ చేయనున్నట్లు అధికారికంగా తెలిపింది. కాగా... ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన రాధాకృష్ణ విఖే పాటిల్‌కు షిర్డి నియోజకవర్గం టికెట్ కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది. జామ్నెర్ నుంచి రాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ పోటీ చేస్తారని బీజేపీ నేత అరుణ్ సింగ్ మీడియా సమావేశంలో తెలిపారు. ఇదిలా ఉంటె మహారాష్ట్రకు ఈ నెల 21 న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ శివసేన కూటమిగా బరిలోకి దిగబోతోంది. కాగా... ఇప్పటికే విజయం మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తోన్న సీఎం ఫడ్నవిస్... ఈ ఎన్నికల్లో శివసేనతో కలిసి గతం కంటే ఎక్కువ స్థానాలు సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.